కాకినాడ: ప్రత్యేక హోదాపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. కాకినాడ కృషి భవన్ లో బీజేపీ సంఘటనా పర్వ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పురంధేశ్వరి ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ చేసిన తప్పు వైసిపి చేస్తుందని ఆరోపించారు.

చంద్రబాబు నాయుడు చేసిన తప్పును వైయస్ జగన్ చేయోద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. హోదా విషయంలో  టీడీపీ మాదిరిగా జగన్ ప్రజలను మభ్యపెట్టొద్దని సూచించారు. హోదా సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. 

మరోవైపు గోదావరి జలాల పంపకాల విషయంలో తెలంగాణా ప్రభుత్వంతో మాట్లాడేటప్పుడు అఖిల పక్షం, రైతు సంఘాలు, రైతు సమాఖ్యల అభిప్రాయాలను సీఎం జగన్ పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. 

వర్షాభావ పరిస్థితులతో ఏపిలో భూ గర్భ జలాలు అడుగంటిపోయాయని చెప్పుకొచ్చారు. త్రాగు, సాగు నీటి కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి తరుణంలో గోదావరి జలాల పంపకాల విషయంలో ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోనికి తీసుకొవాలని కోరారు. 

ఇకపోతే ప్రధానమంత్రి స్కూటీ యోజన పథకం అనేది లేదని చెప్పుకొచ్చారు. కేంద్రప్రభుత్వం కానీ బీజేపీ గానీ ఈ పథకంపై ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ఈ ప్రచారాన్ని నమ్మెద్దని సూచించారు.