ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ఏపీలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ఏపీలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని చెప్పారు. మూడు పార్టీల మధ్య పొత్తు ఉండాలనేది తన అభిప్రాయం అని.. బీజేపీ అధినాయకత్వం కూడా ఈ మేరకు సంకేతాలు ఇచ్చిందని చెప్పారు. ఇటీవల కేంద్ర మంత్రి నారాయణస్వామి కూడా ఇదే మాట చెప్పారని అన్నారు. అధిష్టానం సంకేతాలు లేకుంటే తాను ఎందుకు మాట్లాడతానని అన్నారు. అయితే పొత్తుల విషయంలో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. 

ముఖ్యమంత్రి జగన్ కు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేదని... సీబీఐ కేసుల నుంచి ఆయనను బీజేపీ కాపాడుతోందనే ప్రచారంలో నిజం లేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహంగానే ఉందని తెలిపారు. జగన్‌ను కలుపుకునే ప్రసక్తే లేదని అన్నారు. శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా, విశాఖపట్నంలో అమిత్ షా.. వైసీపీ సర్కార్ అవినీతిపై విమర్శలు గుప్పించారని గుర్తుచేశారు.

Also Read: ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన పురందేశ్వరి.. జగన్ సర్కార్‌పై ప్రశ్నల వర్షం..

ఇదిలా ఉంటే, టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా చిట్‌చాట్‌లో బీజేపీతో పొత్తు ఉంటుందా? అనే ప్రశ్నకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరెవరో ఏదేదో మాట్లాడితే.. తాను దానిమీద స్పందించనని అన్నారు. రాష్ట్ర సమస్యల మీద ప్రజలు, ప్రభుత్వం గట్టిగా ఉంటే కేంద్రం తనంతట తానే దిగివస్తుందని చెప్పుకొచ్చారు. దీనికి ఉదాహరణగా జల్లికట్టు ఘటనను చెప్పుకొచ్చారు. అవసరమైతే తానే ఢిల్లీతో పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు.