Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ తో స్నేహం పక్కన పెట్టి బకాయిలు వసూలు చేయాలి: జగన్ ను కోరిన టీజీ వెంకటేష్

తెలంగాణ రాష్ట్రం నుండి రావాల్సిన బకాయిలపై ఏపీ సీఎం దృష్టి పెట్టాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి వేల కోట్లను కేటాయించిందన్నారు. 

BJP Former MP  TG Venkatesh demads  to collect Dues From Telangana
Author
Guntur, First Published Aug 25, 2022, 9:48 AM IST

తిరుపతి: రాష్రానికి తెలంగాణ నుండి రావాల్సిన బకాయిలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్రీకరించాలని మాజీ ఎంపీ, బీజేపీ నేత టీజీ వెంకటే్ష్ డిమాండ్ చేశారు.గురువారం నాడు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తిరుపతి లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం నుండి ఏపీకి వేలకోట్ల రావాల్సి ఉందన్నారు. విద్యుత్ విషయమై తెలంగాణ రాష్ట్రం ఏపీ రాష్ట్రానికి ఉన్న బకాయిల విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కేసీఆర్ తో స్నేహాన్ని పక్కన పెట్టి ఏపీకి రావాల్సిన బకాయిలను వసూలుపై కేంద్రీకరించాలని ఆయన ఏపీ సీఎం జగన్ కు సలహా ఇచ్చారు.  ప్రత్యేక హోదా అనేది ప్రచారం అంశం మాత్రమేనని ఆయన  అభిప్రాయపడ్డారు. కేంద్రం ఇస్తామన్న ప్యాకేజీని రాష్ట్రం తీసుకోువాలన్నారు. ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయాలను కేటాయించిందని టీజీ వెంకటేష్ గుర్తు చేశారు.

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు.  ఇంకా కూడా ప్రత్యేక హోదా తెస్తామంటూ మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను వైసీపీ మభ్య పెడుతుందన్నారు. వైసీపీ సర్కార్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్దిపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ధార్మిక కార్యక్రమాలకే టీటీడీ నిధులను ఖర్చు చేయాలని ఆయన కోరారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాను ఐదేళ్ల పాటు ఇస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం హమీ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ విభజన చట్టంలో ఈ విషయాన్ని పొందుపర్చారు. 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఏపీలో బీజేపీ కూడా ప్రభుత్వంలో చేరింది. అయితే ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని అప్పటి కేంద్రం ప్రకటించింది.ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీకి టీడీపీ సర్కార్ ఒప్పుకుంది. అయితే ప్రత్యేక హోదా ను విస్మరించి ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకోవడంపై చంద్రబాబు సర్కార్ పై అప్పట్లో విపక్షాలు విమర్శలు చేశాయి. 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశం ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు  అధికారాన్ని కోల్పోయి వైఎస్ జగన్ అధికారాన్ని చేపట్టారు.

2014 లో కంటే 2019 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ తన బలాన్ని పెంచుకుంది. మిత్రపక్షాల మద్దతు అవసరం లేకుండానే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే  ఈ పరిణామం ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ కు ఇబ్బందిగా మారింది. మిత్రపక్షాలు  లేదా ఇతర పార్టీల మద్దతు అవసరం లేకపోవడంతో ప్రత్యేక హోదా అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చినా  ఆశించిన ఫలితం లేదనే అభిప్రాయంతో వైసీపీ నాయకత్వం ఉంది. 

ఢిల్లీకి వెళ్లిన సమయంలో ప్రత్యేక హోదా అంశంపై మోడీ సహా కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావిస్తున్న విషయాన్ని  వైసీపీ నేతలు గుర్తు  చేస్తున్నారు. అయితే ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని పార్లమెంట్ వేదికగానే కేంద్రం స్పష్టం చేసిన విషయాన్ని  వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios