విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిప్పులు చెరిగారు. ఇద్దరు దొంగల్లో చంద్రబాబు మంచిదొంగ అని ప్రజలు ఓటేస్తే  ఇప్పుడు చంద్రబాబు గజదొంగ అయ్యారని ఘాటుగా విమర్శించారు. విశాఖపట్నంలో బీజేపీ రాష్ట్ర కార్యవకర్గ సమావేశంలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన బీజేపీ చేయ్యాల్సిన దాని కంటే ఎక్కువే చేసిందని కన్నా స్పష్టం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చెయ్యడం లేదని కేంద్రం నిధులను మళ్లించి తమ అభివృద్ధిగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖకు రైల్వేజోన్ వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

మోదీ ఇమేజ్ ను డామేజ్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీని చూసి చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవాచేశారు. ఆఖరికి చంద్రబాబుకు జ్వరం వచ్చినా అది మోదీ కుట్రేనని అంటారన్నారు. చంద్రబాబు తన నీడను తానే చూసి భయపడుతున్నారని విమర్శించారు. తాను దోపిడీ చేస్తూ ప్రజలను అండగా ఉండమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 

మరోవైపు ధర్మాబాద్‌ కోర్టు నోటీసులపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బాబ్లీ విషయంలో ముద్దాయిగా చంద్రబాబు 37 సార్లు కోర్టు నోటీసులు ఇచ్చినా హాజరు కాకపోవడం వల్లే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారని తెలిపారు. 2016 ఫిబ్రవరిలో ధర్మాబాద్ కోర్టుకు చంద్రబాబు తరపున న్యాయవాది హాజరైనట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.  

అయితే శుక్రవారం ధర్మాబాద్ కోర్టులో వాదనల అనంతరం అక్టోబర్ 15న ముద్దాయిలు 16 మంది ముద్దాయిలను హాజరుకావాలని కోర్టు ఆదేశించిందని దాన్ని కూడా నరేంద్రమోదీకుట్ర అంటారేమోనని విమర్శించారు. చంద్రబాబు నాయుడు నాటకాలు ఆపాలని హితవు పలికారు. 

ఇకపోతే చంద్రబాబు ప్రచార ఆర్భాటం వల్లే పుష్కరాల్లో 29 మంది భక్తులు మృతిచెందారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రచారం కోసం నేషల్‌ జియోగ్రఫీ ఛానల్‌కు 64 లక్షలు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. వీఐపీ ఘాట్ ఉండగా చంద్రబాబు పుష్కరఘాట్ దగ్గరే ఎందుకు స్నానం చేశారో చెప్పాలన్నారు. చెయ్యి ఊపే షాట్ కోసం 29 మందిని బలితీసుకున్నారన్నారు. పుష్కరాల్లో తొక్కిసలాటపై సోమయాజుల కమిటీ నివేదిక దురదృష్టకరమన్నారు.