పొత్తులపై కేంద్ర పార్టీదే తుది నిర్ణయం: బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి
పొత్తులపై కేంద్ర పార్టీ నిర్ణయమే ఫైనల్ అని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారు.
అమరావతి: పొత్తులపై కేంద్ర పార్టీదే తుది నిర్ణయని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారు.బుధవారంనాడు అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడారు.
టీడీపీతో కలిసి పోటీ చేయాలని జనసేన నేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. అదే సమయంలో బీజేపీతో కూడ తమ పార్టీ పొత్తులో ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారని ఆమె గుర్తు చేశారు.టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కూడ కలిసి వస్తుందని భావిస్తున్నామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారన్నారు.ఈ విషయమై బీజేపీ కేంద్ర నాయకత్వంతో చర్చించనున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారని పురంధేశ్వరి ప్రస్తావించారు.ఈ విషయాన్ని పార్టీ కేంద్ర నాయకత్వం చూసుకుంటుందన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరైంది కాదన్నారు.రాష్ట్రంలో ఏం జరిగినా బీజేపీకి ఆపాదించడం తగదని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది.ఈ కేసులో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఇటీవల పరామర్శించారు.ఈ పరామర్శించిన తర్వాత టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ఆయన ప్రకటించారు.2019 ఎన్నికల తర్వాత బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదరింది. 2024 ఎన్నికల్లో కూడ కలిసే పోటీ చేస్తామని అప్పట్లోనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే టీడీపీతో కలిసి వెళ్లాలని జనసేనాని నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ కూడ తమతో కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ దిశగా బీజేపీ కేంద్ర నాయకత్వంతో చర్చించనున్నట్టుగా కూడ ఆయన ప్రకటించారు. టీడీపీతో కలిసి పోటీ చేయాలనే నిర్ణయంపై కొందరు బీజేపీ నేతలు అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేయాలనే ప్రతిపాదనను సమర్ధిస్తున్నాయి.
2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు కలిసి పోటీ చేశాయి.ఈ కూటమికి అప్పట్లో పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ కూటమి అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు.