Asianet News TeluguAsianet News Telugu

దాడి నువ్వే చేయించుకున్నావేమో: జగన్ మీద కన్నా అనుమానం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏడాది పాలనపై బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తీవ్రంగా ధ్వజమెత్తారు. డేటా చోరీ కేసును వదిలేశారంటే జగన్ తానే దాడి చేయించుకున్నారేమోననే అనుమానం కలుగుతోందని అన్నారు.

BJP AP president Kanna Lakshminarayana reacts on YS Jagan one year admnistration
Author
Amaravathi, First Published Jun 1, 2020, 12:51 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతీకారానికే ప్రాధాన్యం ఇస్తున్నారని బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వంలో వ్యక్తులు మారారు తప్ప వ్యవస్థలో మార్పు రాలేదని ఆయన అన్నారు. 2019లో చెప్పిన మాటలను విశ్వసించి వైఎస్ జగన్ కు ఓసారి అవకాశం ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అసలు రూపం బయటపడిందని ఆయన అన్నారు. 

ఏడాది మొత్తం కక్ష సాధింపుతో, అవినీతితో, పోలీసు రాజ్యంతో నడిచిందని ఆయన అన్నారు. జగన్ కప్పుకున్న మేకతోలు ఊడిపోయిందని అన్నారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును టూరిజం ప్రాజెక్టుగా మార్చారని ఆయన అన్నారు. జగన్ పాలనలో గత ఏడాదిగా పోలవరం నిర్మాణం ముందుకు సాగలేదని ఆయన అన్నారు. 

రాష్ట్ర విభజన తరువాత టిడిపి, వైసిపి రెండు ప్రాంతీయ పార్టీలు మధ్య పోటీ జరిగిందని, అనుభవం ఉన్న వ్యక్తి గా చంద్రబాబు కు ప్రజలు పట్టం కట్టారని, చంద్రబాబు తన అనుభవంతో ఎలా దోచుకోవాలి, కేంద్రం నుంచి తెచ్చి ఎలా పక్కదారి పట్టించాలనే ఆలోచన చేశారని ఆయన విమర్శించారు. 2014-19 వరకు కేంద్రం నిధులను సొంత పథకాలుగా ప్రచారం చేసుకున్నారని చెప్పారు. 

చంద్రబాబు చేసిన తప్పులను చూపుతూ.. నాకు అవకాశం ఇవ్వాలని జగన్ ప్రజలను కోరాడని అన్నారు.2019లో ప్రజలు నమ్మి జగన్ కు అవకాశం ఇస్తే... ఆయన విశ్వరూపం చూపిస్తున్నారని అన్నారు. జగన్ మాటలు వింటుంటే... ప్రజలు తమను తామే మోసం చేసుకునే విధంగా ఉన్నాయని అన్నారు. అనుభవ రాహిత్యం, అసమర్ధత, అవినీతి, అవగాహన లేకపోవడం, ఆత్రం,  పోలీసు రాజ్యం, రివర్స్ టెండరింగ్.. ఇదే జగన్ ఏడాది పాలన అని ఆయన వ్యాఖ్యానించారు. 

పోలవరం పనుల్లో అవినీతి జరిగిందనేది వాస్తవమని, జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యాక అవినీతి బయటకు తీస్తానన్నాడని, 2021కల్లా పూర్తి చేస్తానన్న జగన్.. న్యాయపరమైన చిక్కులు కూడా పరిష్కారం చేయలేని అసమర్థత కనిపిస్తుందని అన్నారు. ఎపి రాజధాని చుట్టూ రెండు పార్టీలు రాజకీయం చేశాయని, జగన్ వచ్చాక మూడు రాజధానుల పేరుతో కొత్త రాజకీయం చేశాడని కన్నా అన్నారు. 

విశాఖ భూముల వ్యవహారంలో సిబిసిఐడి వేసినా... అవినీతి నిరూపించక పోవడం అసమర్థత కాదా అని ఆయన ప్రశ్నంచారు. రాయలసీమలో పెండింగ్ లో ప్రాజెక్టులను కూడా పట్టించు కోలేదని అన్నారు.,ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టిడిపి హయాంలో ఇసుక, మైనింగ్ దోపిడీ జరిగిందని, 

ఇప్పుడు ప్రభుత్వం మారినా... దోపిడీ మాత్రం కామన్ అయిపోయిందని అన్నారు. హైకోర్టు 65 తీర్పులు వ్యతిరేకంగా రావడమే ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదనడానికి  నిదర్శనమని ఆయన అన్నారు. హైకోర్టుకు కూడా కులాలు, మతాలను అంటగట్టేలా వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు బరితెగించారని ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి సిఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

టిటిడి పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని ప్రచారం చేశావుఇప్పటికీ ఆ పింక్ డైమండ్ ఏమైందో కనుక్కోలేకపోయావని ఆయన జగన్ ను ఉద్దేశించి అన్నారు. డేటా చౌర్యం అన్న జగన్.... వాటిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. డేటా చౌర్యంపై  నేను వ్యక్తిగతంగ ఫిర్యాదు చేశానని,  నా మీద హత్యాప్రయత్నం చేశారని అన్న జగన్.. ఆ కేసు ఏమైందో చెప్పాలని కన్నా అన్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే... నువ్వే చేయించుకుని.. డ్రామా ఆడావనే అనుమానం కలుగుతుందని అన్నారు. తాను 70కి పైగా ఉత్తరాలు రాస్తే... దున్నపోతు మీద వర్షం పడిన చందంగా స్పందించలేదని విమర్శించారు. 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు కూడా కులం అంటగట్టి.. ఆర్డినెన్స్ ద్వారా తొలగిస్తారా అని కన్నా ప్రశ్నించారు. 151సీట్లు నీకిస్తే.. ధైర్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేదని అన్నారు. జగన్ గొప్ప సిఎం కాదు... విఫలమైన సిఎం అని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios