తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్టు రంగుల విషయంలో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మూడు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులను తొలగించాలని ఆదేశించింది. 

వైసీపీ రంగుల రాజకీయం పై హై కోర్ట్ తీర్పు నేపథ్యంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ విరుచుకుపడ్డారు. వైసీపీ రంగుల పిచ్చి పరాకాష్టకు చేరిందని జాతీయ జెండాకు కూడా పార్టీ రంగులు వేశారని విరుచుకు పడ్డారు. 

"అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వైకాపాకు పట్టుకున్న రంగుల పిచ్చికి కోర్టులో చుక్కెదురైంది. బోరు పంపుల నుంచీ స్మశానవాటికలో సమాధులకు కూడా రంగులేశారు. చెట్టూపుట్టా దగ్గర మొదలెట్టి, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామసచివాలయలు.. చివరకు విజ్ఞత మరిచి జాతీయ జెండా తొలగించి పార్టీ రంగులు వేశారు." అని ట్వీట్ చేసారు. 

ఇక ఇదే ట్వీట్ కి అనుబంధంగా వైసీపీ రంగుల రాజకీయానికి 1400 కోట్ల రూపాయలు ఖర్చయిందని, అలా ఇప్పటికైనా ప్రజా ధనాన్ని వృధా చేయడం ఆపాలని ఆయన అధికార వర్గానికి హితవు పలికారు. 

"పరాకాష్టకు చేరింది వైసీపీ రంగుల రాజకీయం. ప్రజాధనం ఇలా దుర్వినియోగం చేయడం అక్రమం అంటూ బీజేపీ ఎన్నోసార్లు హెచ్చరించినా సుమారు 1400 కోట్లు దుర్వినియోగం చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఇపుడు రంగులు మార్చడానికి ఎంత వృధా చేయనున్నారో? ఇకనైనా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకండి." అని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు కన్నా. 

ఇకపోతే.... వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సవాల్ కు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రతిస్పందించారు.కాణిపాకం ఆలయంలో  ప్రమాణానికి తాను సిద్దంగా ఉన్నానని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

మంగళవారంనాడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కాణిపాకంలోనైనా వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని విజయసాయిరెడ్డి ప్రకటించారు.