న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నానిపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని టీడీపీని వీడి బీజేపీలో చేరుతారంటూ వస్తున్న వార్తలపై స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ తమ పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని తెలిపారు. 

తాను ఇప్పటి వరకు నానితో మాట్లాడలేదన్న ఆయన అయితే పార్టీ పెద్దలతో నాని టచ్‌లో ఉన్నారేమో అని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే బీజేపీలోకి వస్తామంటూ చాలా మంది ముఖ్యనేతలు తమను సంప్రదిస్తున్నారని తెలిపారు. 

బీజేపీలోకి చేరేందుకు ఏపీలో కీలక నేతలు క్యూ కడుతున్నారని స్పష్టం చేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు. పార్టీలో చేరే సమయంలో వారి వివరాలు వెల్లడిస్తామని కన్నా స్పష్టం చేశారు. 

ఈనెల 9వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ తిరుమలకు వస్తున్నారని తెలిపారు. ఈ పర్యటన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో ప్రధాని మోదీని పర్యటించాల్సిందిగా కోరనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.