ఏపీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం: బీజేపీ పదాధికారుల భేటీలో పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శలు చేశారు. కేంద్రం రాష్ట్రానికి సహాయ సహాకారాలు అందిస్తుందని ఆమె గుర్తు చేశారు.
విజయవాడ:ఏపీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారు.
ఆదివారంనాడు బీజేపీ పదాధికారుల సమావేశం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశంలో పురంధేశ్వరి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె విమర్శించారు.ఇసుక మాఫియాతో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవని ఆమె ఆరోపించారు. అన్నమయ్య ప్రాజెక్టు డ్యాం కొట్టుకుపోవడానికి ఇసుక మాఫియానే కారణంగా ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉందన్నారు. ఎన్నికలకు సిద్దం కావాలన్నారు. ఈ మేరకు పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. సంస్థాగతంగా మార్పులు చేర్పులు అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు.
రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక వాతావరణం ఉందన్నారు.ఈ వాతావరణాన్ని బీజేపీని బలోపేతం చేసుకునేందుకు అవకాశం మలుచుకోవాలని ఆమె పార్టీ శ్రేణులను కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టడంతో పెట్టుబడులు రావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా నిరుద్యోగం కూడ పెరిగిపోయిందని ఆమె విమర్శించారు.