శ్రీకాకుళం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. 

శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కేసీఆర్ సంధించిన ఒక్క ప్రశ్నకు కూడా చంద్రబాబు సమాధానం చెప్పలేరన్నారు. సూటిగా సమాధానం చెప్పలేకే ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రులతో, టీడీపీ నేతలతో ఖండిస్తున్నారని ఆరోపించారు. 

రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గమైన, అవకాశవాద రాజకీయ నాయకుడు మరోకరు ఉండరన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అక్రమంగా దోచుకున్న సొమ్మును తెలంగాణ ఎన్నికల్లో మంచినీళ్లలా పారించాడని ఆరోపించారు. 

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఓటుకు మూడు నుంచి నాలుగు వేలు ఖర్చు పెట్టైనా సరే అధికారంలోకి రావాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రజలు తమ ఓటుతో టీడీపీకి దిమ్మతిరిగే తీర్పు ఇవ్వడం ఖాయమన్నారు.

మరోవైపు వైసీపీవి బానిస రాజకీయాలన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. శవరాజకీయాలకు మారు పేరు చంద్రబాబు అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం మొదట నుంచి పోరాటం చేస్తూ, ఒకే మాట మీద నిలబడింది వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని గుర్తు చేశారు. హోదాకు ఎవరు మద్దతిస్తే, వారితో కలవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పరోక్షంగా పొత్తులపై తమ పార్టీ వైఖరిని స్పష్టం చేశారు.