కర్నూలు:  గత 24 గంటల్లోనే ఏపీలో కరోనా కేసులు పెరిగాయని, ఒక్క కర్నూలు జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయనిస మొత్తంగా జిల్లాలో 332 కేసులు నమోదవగా, 9 మంది చనిపోయారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత భూమా అఖిలప్రియ అన్నారు. కర్నూలు జిల్లాలో కేసులను బయటకు రానీయకుండా ఈ ప్రభుత్వం దాచిపెడుతోందని ఆమె విమర్శించారు. 

కేసులను దాచిపెట్టడం వల్ల ప్రభుత్వానికి ఏమొస్తుంది? ప్రభుత్వ అజెండా ఏమిటని ఆమె ప్రశ్నించారు.  కర్నూలు జిల్లాలో కరోనా కేసులకు సంబంధించి వాస్తవాలు బయట పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ్న్నారు. సమస్య బయటపెడితే ప్రజలు జాగ్రత్త పడతారని ఆమె అన్నారు.
    
ముఖ్యమంత్రి సహా వైసీపీ నేతలు లాక్ డౌన్ విజయవంతం  చేశామని అబద్ధాలు చెబుతున్నారని, లాక్ డౌన్ నిబంధనలు సరిగా అమలు చేసి ఉంటే కేసులు తగ్గాలి కదా అని అఖిప్రియ అన్నారు. ఢిల్లీ సదస్సుకు వెళ్లిన వారి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉందా అనే అనుమానం వస్తోందని అన్నారు.    

జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా అందర్నీ గందరగోళానికి గురిచేస్తున్నారని అంటూ ఓవైపు కేసులు పెరుగుతున్నప్పటికీ జ్వరంతో కరోనాను పోల్చడాన్ని ఏమనాలని ఆమె ప్రశ్నించారు. కరోనాపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వలేకపోతున్నారంటే ఆయన పాలన ఎలా ఉందో అర్ధమవుతోందని అఖిప్రియ అన్నారు.    

కరోనాతో కలిసి పనిచేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చెప్పడమేంటి? కరోనాను తగ్గించలేక చేతులెత్తేస్తున్నామని మీరు ఒప్పుకుంటున్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, వైసీపీ నేతలు ఒకటే మాట చెబుతున్నారని అన్నారు. టెస్టింగ్ లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ అంటున్నారని, టెస్టింగ్ చేసినప్పుడల్లా కేసులు పెరుగుతున్నాయి కదా అంటూ మరి దానిపై ఎందుకు మీరు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు.    

కరోనా తీవ్రత వైసీపీ నేతలకు ఎందుకు అర్ధం కావడం లేదని అంటూ లాక్ డౌన్ పదే పదే ఉల్లంఘిస్తున్న నేతలపై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని అఖిలప్రియ అడిగారు. 24 గంటల్లోగా కర్నూలు జిల్లాలో కరోనా కేసుల వివరాలు ప్రభుత్వం బయటపెట్టకపోతే తామే బండారం బయటపెడతామని అన్నారు. అదే జరిగితే వైసీపీ నేతలు తమ ముఖాలను ప్రజలకు చూపించుకోలేరని అన్నారు.    

వైసీపీ ప్రభుత్వానికి రాయలసీమ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా కర్నూలు జిల్లాకు ముఖ్యమంత్రి రావాలని అన్నారు. స్వయంగా ఆయనే కేసుల వివరాలు తెలుసుకోవాలని అన్నారు. విశాఖలో హుద్ హుద్ వచ్చినప్పుడు చంద్రబాబు అక్కడే ఉన్నారని, పగలూ రాత్రి పర్యవేక్షించారని ఆమె గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ కు రావాలని అన్నారు.    

గ్రీన్, ఆరెంజ్ , రెడ్ జోన్లు అన్నారని, గ్రీన్ జోన్ల ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తేస్తామన్నారని అంటూ అదే జరిగితే గ్రీన్ జోన్లోకి రెడ్ జోన్ వారు వెళ్లరని ప్రభుత్వం హామీ ఇవ్వగలదా అని అఖిలప్రియ అడిగారు.    మండల హెడ్ క్వార్టర్లలో ధాన్యం కొనుగోలు పాయింట్లు పెట్టాలని అన్నారు. అలాంటి ఆలోచన చేయకుండా తాలూకా మొత్తానికి మార్కెట్ యార్డులో పాయింట్ పెడితే ఎలా ప్రశ్నించారు. గ్రీన్ జోన్ ఏరియా వారిని కూడా ప్రభుత్వం ఇబ్బందుల్లో పెడుతోందని అఖిలప్రియ అన్నారు.