హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య  కేసులో కుటుంబసభ్యులను విచారించేందుకు బంజారాహిల్స్ పోలీసులు గుంటూరుకు వెళ్లారు. ఈ కేసులో విచారణకు రావాలని బంజారాహిల్స్ పోలీసులు కోడెల శివప్రసాద్ రావు కుటుంబసభ్యులకు నోటీసులు పంపారు. అయితే ఇప్పటివరకు విచారణకు రానుందున  పోలీసులే  గుంటూరుకు బుధవారం నాడు వెళ్లారు.

గత నెల 16వ తేదీన  హైద్రాబాద్‌‌లోని  తన నివాసంలో కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఆత్మహత్యను పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. ఈ కేసులో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని పోలీసులు విచారించారు.

ఈ కేసులో కీలకమైన కోడెల శివప్రసాద్ రావు కాల్ డేటాను కూడ పోలీసులు విశ్లేషిస్తున్నారు. కోడెల శివప్రసాద్ రావు కొడుకు కోడెల శివరాం, కోడెల కూతురు విజయలక్ష్మితో పాటు ఇతర కుటుంబసభ్యులను కూడ విచారించాలని  పోలీసులు బావించారు. ఈ మేరకు నోటీసులు కూడ పంపారు. అయితే 11 రోజుల సమయం అడిగారు. కానీ, విచారణకు హాజరుకాలేదు.

బుధవారం నాడు కోడెల శివరాం అసెంబ్లీ ఫర్నీచర్ కేసు విషయమై హైకోర్టుకు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కోడెల శివప్రసాద్ రావు కుటుంబసభ్యులపై పలు కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కేసులను నమోదు చేయించిందని  టీడీపీ ఆరోపణలు చేసింది. ఈ కేసుల కారణంగానే కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా చంద్రబాబునాయుడు ఆరోపించారు.