హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన కోరిక అని సినీ నిర్మాత, హాస్య నటుడు బండ్ల గణేష్ అన్నారు. ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయం వెల్లడించారు. పవన్ కల్యాణ్ అధికారంలోకి వస్తే చూస్తూ ఆనందిస్తానని, అంతే తప్ప మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. 

ఇది టెంపరరీగా కాదు.. పాలిటిక్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేశాను అంతేనని బండ్ల గణేష్ అన్నారు. మంచి సినిమా.. కాస్త మనకు డబ్బులు మిగులుతాయని అనుకుంటే తీస్తానని చెప్పారు. డబ్బులు మిగలకుండా సినిమా తీయాలంటే తనకు భయమని చెప్పారు. రిస్క్ తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. ఇప్పుడైతే తాను అన్ని విధాలా హ్యాపీగా ఉన్నానని, రిస్క్ చేయడం ఎందుకని చేయడం లేదని ఆయన అన్నారు. 

సినిమాలకు టైమ్ ఉంటుంది కానీ.. రాజకీయాలకు ఎలాంటి టైమ్ ఉండదని,, అంత ఓపిక తనకు లేదని అన్నారు. తాను మంత్రి అయిపోవాలని అనుకున్నానని, కొందరు తనను చెడగొట్టారని,  మీలాంటి వాళ్లు ప్రమాణ స్వీకారం చేయాలని తప్పు దోవ పట్టించారని ఆయన అన్నారు. ఉన్నదీ పోయింది, ఉంచుకున్నదీ పోయింది అనే పరిస్థితి తనకు వచ్చిందని ఆయన అన్నారు.

తాను రాజకీయాలకు పనికిరానని ఎన్నికలకు ముందే తేలింది గానీ వెంటనే బయటికి వచ్చేస్తే బాగుండదని పార్టీలోనే ఉండాల్సి వచ్చిందని ఆయన అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ స్టారూ కాదని తేలిపోయిందని గణేష్ అన్నారు.