టీడీపీ అధినేత‌ నారా చంద్ర‌బాబు అరెస్టుపై న‌టుడు, ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ 16 నెల‌లు జైల్లో ఉన్నాడ‌ని, అందుకే చంద్ర‌బాబు వంటి వారిని క‌నీసం 16 నిమిషాలైనా జైల్లో పెట్టాల‌నే ఉద్దేశంతోనే అరెస్టు చేశార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. 

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్ట్‌ చేసింది. నంద్యాల ఆర్.కే. ఫంక్షన్ హాల్ వద్ద చంద్రబాబును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై సిఐడి అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు 15 నుండి 20 ప్రశ్నలను అడిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండంలా మారింది. టిడిపి అధినేత అరెస్టు నిరసిస్తూ ఆ పార్టీ నేతలు కార్యకర్తలు రోడ్డు పైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు.

ఈ తరుణంలో చంద్రబాబు అరెస్టును టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. చంద్రబాబును ఎలాగైనా జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో ఆయన ఇరికించాలని అన్నారు. సిట్ కార్యాలయంలో ఉన్న చంద్రబాబును కలిసేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బాలకృష్ణ, నారా బ్రాహ్మణి గన్నవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.

జ‌గ‌న్ 16 నెల‌లు జైల్లో ఉన్నాడ‌ని, అందుకే చంద్ర‌బాబు వంటి వారిని క‌నీసం 16 నిమిషాలైనా జైల్లో పెట్టాల‌నే ఉద్దేశంతోనే అరెస్టు చేశార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. సీఎం జగన్ ప్ర‌జ‌ల‌ను పాలించేందుకు అధికారంలోకి రాలేద‌ని, ప్ర‌తిప‌క్షాల‌పై క‌క్ష సాధిచేందుకు వ‌చ్చాడ‌ని బాలకృష్ణ విరుచుకుప‌డ్డారు. టీడీపీ అధినేత‌, 14 ఏళ్ల ముఖ్య‌మంత్రి చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ దుర్మార్గమని బాల‌య్య వ్యాఖ్యానించారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని యెద్దేవా చేశారు.

స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు ఏర్పాటుచేసి చాలా మంది నిరుద్యోగ యువతకు శిక్షణ కల్పించి.. ఉపాధి చూపించామని అన్నారు. మూడు రాజధానులని మూడు సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నారనీ, నవరత్నాలు పేరిట 80వేల కోట్లు అప్పులు చేశారని అన్నారు. ఎవరు తీరుస్తారు ఆ బకాయిలు అని బాలకృష్ణ ప్రశ్నించారు.

వనరులు ఎలా ఉత్పత్తి చేయాలో సీఎం జగన్‌కు తెలియదని, అభివృద్ధి అనేది మన రాష్ట్రంలో ఎక్కడ ఉందని ప్రశ్నించారు. రాష్ట్రంలో అప్పులు.. మరోవైపు గుంతలు తప్ప అభివృద్ధి శూన్యమనీ, ఒక్క రోడ్డైనా బాగుందని బాలకృష్ణ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై పార్టీయే కాదు.. ప్రజలు కూడా ఉద్యమిస్తారని బాలయ్య పేర్కొన్నారు.