రాజమండ్రికి బాలకృష్ణ.. కాసేపట్లో చేరుకోనున్న పవన్.. మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబుతో ములాఖత్
స్కిల్ డెవలప్‌మెంట్‌లో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనతో పవన్, బాలకృష్ణ, లోకేష్‌లు ఈరోజు ములాఖత్ కానున్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్‌లో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ములాఖత్ కానున్నారు. చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించినప్పటీ నుంచి అక్కడికి సమీపంలోనే బస చేస్తున్న సంగతి తెలసిందే. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా అక్కడే ఉన్నారు.
చంద్రబాబుతో ములాఖత్ నేపథ్యంలో.. నందమూరి బాలకృష్ణ ఈరోజు ఉదయం రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి లోకేష్, భువనేశ్వరిలు బస చేస్తున్న చోటుకు చేరుకున్నారు. అక్కడ తన సోదరి, కూతురు బ్రాహ్మణిలతో బాలకృష్ణ సమావేశమయ్యారు.
మరోవైపు పవన్ కల్యాణ్ కూడా మరికాసేపట్లో రాజమండ్రి చేరుకోనున్నారు. ఇందుకోసం పవన్ ఇప్పటికే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి బయలుదేరారు. రాజమండ్రి చేరుకున్న తర్వాత చంద్రబాబు కుటుంబ సభ్యులను కూడా పవన్ పరామర్శించే అవకాశం ఉంది. ఇక, చంద్రబాబుతో పవన్, బాలకృష్ణ, లోకేష్‌ల ములాఖత్ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలుతో పాటు.. నగరంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
అయితే చంద్రబాబుతో పవన్, బాలకృష్ణ, లోకేష్‌లు కలవనుండటం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. ఈ సందర్భంగా ఏ అంశాలు చర్చించనున్నారానేది ఉత్కంఠ రేపుతోంది. జనసేన, టీడీపీ పొత్తులపై ఏదైనా ప్రకటన ఉంటుందా?, తాజా రాజకీయ పరిణామాలపైనే చర్చలు పరిమితం అవుతాయా? ఉమ్మడి కార్యచరణ ఏమైనా ఉంటుందా? అనే చర్చ సాగుతుంది.