రాజమండ్రి జైలులో చంద్రబాబుతో పవన్, బాలకృష్ణ, లోకేష్ ములాఖత్.. వివరాలు ఇవే..
స్కిల్ డెవలప్‌మెంట్‌లో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. జైలులో ఉన్న చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు ములాఖత్ అయ్యారు.

స్కిల్ డెవలప్‌మెంట్‌లో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు ములాఖత్ అయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు ఈ ములాఖత్ జరగనుంది. అనంతరం ముగ్గురు నేతలు మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం పవన్ కల్యాణ్ రాజమండ్రి జైలుకు కిలో మీటర్ దూరంలో ఏర్పాటు చేసిన క్యాంపులో బస చేస్తున్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని పరామర్శించనున్నట్టుగా తెలుస్తోంది. ఇక, రాజమండ్రిలో పోలీసులు 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంచారు.
ఇక, ఇందుకోసం ఈరోజు ఉదయం బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌లు వేర్వేరుగా రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రాజమండ్రి చేరుకున్న బాలకృష్ణ.. లోకేష్, ఇతర కుటుంబ సభ్యులు బస చేస్తున్న చోటుకు వెళ్లి చర్చలు జరిపారు. అనంతరం బాలకృష్ణ, లోకేష్ కలిసి ఒకే కారులో రాజమండ్రి జైలుకు చేరుకున్నారు. అయితే వారి కారును జైలు మెయిన్ గేట్ వద్ద పోలీసులు నిలిపివేశారు.
మరోవైపు హైదరాబాద్ నుంచి ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌లో రాజమండ్రి చేరుకున్న పవన్ కల్యాణ్.. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఓ ప్రైవేట్ గెస్ట్‌హౌస్ చేరుకున్నారు. అక్కడ కొంతసేపు ఉన్న తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. ఆ తర్వాత పవన్, బాలకృష్ణ, లోకేష్ ముగ్గురు కలిసి నడుచుకుంటూ జైలులోనికి వెళ్లి చంద్రబాబును కలిశారు.
ఇక, రాజమండ్రి జైలులో చంద్రబాబును పవన్, బాలకృష్ణ, లోకేష్‌లు కలవడం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. ఈ సందర్భంగా ఏ అంశాలు చర్చించనున్నారానేది ఉత్కంఠ రేపుతోంది. జనసేన, టీడీపీ పొత్తులపై ఏదైనా ప్రకటన ఉంటుందా?, తాజా రాజకీయ పరిణామాలపైనే చర్చలు పరిమితం అవుతాయా? ఉమ్మడి కార్యచరణ ఏమైనా ఉంటుందా? అనే చర్చ సాగుతుంది.