విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితమే విజయనగరం జిల్లాలోని రామతీర్థం కోదండరామాలయంలో శ్రీరాముడి విగ్రహం తలను గుర్తుతెలియని దుండగులు నరికేసిన ఘటన కలకలం రేపింది. అయితే ఈ దాడి వెనుక టిడిపి నాయకులు హస్తం వుందని...మరీ ముఖ్యంగా ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రోద్భలంతోనే జరిగినట్లు వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు తనదైన స్టైల్లో కౌంటరిచ్చారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. 

''తలలు తియ్యాలన్నా, విగ్రహాలు ధ్వంసం చెయ్యాలన్నా అది జగన్ రెడ్డికే చెల్లింది సాయి రెడ్డి. జగన్ రెడ్డి చేతగాని ముఖ్యమంత్రి అని నీ నోటి తో నువ్వే అంగీకరించినందుకు ధన్యవాదాలు. రామతీర్థం విగ్రహం ధ్వంసంతో పాటు, హిందువుల మనోభావాలు దెబ్బతీసుతున్న ప్రతీ కార్యక్రమం వెనుకా ఏ1,ఏ2 హస్తం ఉందని విగ్రహాల ధ్వంసం కేసులో వైకాపా  నాయకులు పట్టుబడినప్పుడే ప్రజలకు అర్థమైంది. ఇకనైనా నువ్వు కోతి వేషాలు ఆపి అధికారంలో ఉన్నది మీరే అన్న సోయ తెచ్చుకో సాయిరెడ్డి'' అంటూ ట్విట్టర్ వేదికన సంచలన విమర్శలు చేశారు అయ్యన్నపాత్రుడు.   

read more  నిన్న శ్రీరాముడు...నేడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి...ఏపీలో ఆగని విగ్రహాల ధ్వంసం
 
''43 వేల కోట్ల ప్రజాధనాన్ని  దోచుకున్న గజ దొంగలు వైఎస్ జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి అని సిబిఐ, ఈడి ఆధారాలతో సహా రుజువు చేసాయి. ఆస్తులు అటాచ్ చేసాయి.హవాలా మార్గంలో డబ్బు ప్రవాహం,సూట్ కేసు కంపెనీలు,క్విడ్ ప్రో కో తో పేదలకు చెందాల్సిన సొమ్ము దొబ్బి అవినీతి సామ్రాజ్య అధిపతి అయ్యాడు జగన్ రెడ్డి'' అంటూ విమర్శించారు. 
 
''అంతర్జాతీయ క్రిమినల్ గా పేరొందిన జగన్ రెడ్డి ఆఖరికి న్యాయ వ్యవస్థ పైనే బురద రాజకీయం మొదలెట్టాడు.16 నెలలు మాత్రమే చిప్పకూడు తిన్నారు. మరో 16 ఏళ్ళు చిప్పకూడు తినడానికి 2021 లోనే ముహూర్తం.సిద్ధంగా ఉండండి ఏ1,ఏ2'' అంటూ అయ్యన్న సంచలన ఆరోపణలు చేశారు.