ఏలూరు: తెలుగుదేశం పార్టీలో ఆ మంత్రిగారి రూటే సెపరేటు. మనసులో ఏది దాచుకోరు. మనసుకు ఏది అనిపిస్తే అది అనెయ్యడమే. దాని పరిణామాలు ఏంటనేవి ఆలోచించడం తరువాయి అంటారు. పార్టీలో అధినేత అని లేదు తోటి మంత్రులు, ఎమ్మెల్యేలు అని ఉండదు. 

విమర్శించాల్సి వస్తే ఇక ఆయన తర్వాతే. అది సొంత పార్టీ నేత అయినా ఇతర పార్టీ నేతైనా. నరకడం మెుదలు పెడితే వరుసలు చూడను అన్నట్లు విమర్శలు మెుదలు పెడితే సొంత పార్టీ వాళ్లు ఇతర పార్టీ వాళ్లు అనేది ఏమీ ఉండదు ఆయనకు. 

ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారు కదూ ఇంకెవరు మంత్రి అయ్యన్నపాత్రుడు. గతంలో ఈయన తన సహచర మంత్రి గంటా శ్రీనివాసరావును ఏకీ పారేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నా ఫలితం లేదు. చివరికి దండం పెట్టి ఊరుకున్నారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీతో పొత్తు అనే అంశం చర్చకు వచ్చినప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది ఈయనే. 

కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ప్రజలు గుడ్డలు ఊడదీసి కొడతారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని పొగిడారు. నితిన్ గడ్కరీ అందరి వాడు అంటూ  ప్రశంసించేశాడు. అంతకు ముందే తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నితిన్ గడ్కరీని విమర్శించారు. 

ఒక ఘాటు లేఖ కూడా రాశారు. అంతే గంటల వ్యవధిలోనే నితిన్ గడ్కరీని పొగడ్తలతో ముంచెత్తారు. రాష్ట్రంలో రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రి గడ్కరీ ఎంతో సహాయం అందించారని చెప్పుకొచ్చారు.