నంద్యాల: ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవికి ఏవీ సుబ్బారెడ్డి మంగళవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన రాజీనామా లేఖలో స్పష్టం చేశారు. 

రాజీనామా పత్రాన్ని విజయవాడలోని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మైనేజింగ్‌ డైరెక్టర్‌కు ఏవీ సుబ్బారెడ్డి అందజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం తనకు అప్పజెప్పిన బాధ్యతను 9 నెలల పాటు సమర్థవంతంగా నిర్వహించానని ఆయన మీడియాతో అన్నారు. అతి తక్కువ కాలంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి రైతుల స్థితిగతులను తెలుసుకున్నట్లు తెలిపారు. 

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా కృషి చేశానని చెప్పారు. పదవులు ఉన్నా, లేకున్నా ఎప్పుడూ తనను నమ్మిన వారికి అండగా ఉంటానని, భవిష్యత్తులో కూడా ఇదే విధానం కొనసాగిస్తానని ఆయన అన్నారు. విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా తనకు సహకరించిన అధికారులకు, రైతులకు ఏవీ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.