వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన దాడి విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు నచ్చక.. ఆ పార్టీకీ చెందిన  ఓ సీనియర్ నేత ఒకరు పార్టీకి రాజీనామా చేశారు.

 ‘ప్రతిపక్ష నాయకుడు  జగన్ పై దాడి జరిగితే ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు తొలుత ఆ ఘటనను తీవ్రంగా ఖండించాలి.... నిజాలు నిగ్గుతేల్చేందుకు నిష్పక్షపాతంగా విచారణకు ఆదేశించాలి.... నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన  ఆయన ఆ విధంగా వ్యవహరించి ఉంటే  ఎంతో హుందాగా ఉండేది. అయితే దురదృష్టవశాత్తూ ఈ హత్యాయత్నం అనంతరం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు నన్నెంతో మనస్తాపానికి గురిచేశాయి.’ అన్నారు  తూర్పుగోదావరి  జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్‌సెల్‌ ఉపాధ్యక్షుడు మేడపాటి రామారెడ్డి.  

చంద్రబాబు తీరుతో పార్టీ పట్ల పెంచుకున్న నమ్మకం నిర్వీర్యమైందని ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం ఆయన తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.అనంతరం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తన ఆవేదన వెళ్లగక్కారు.

ఎన్టీఆర్ పై  ఉన్న అభిమానంతో టీడీపీలో పనిచేస్తున్నానని రామారెడ్డి చెప్పారు. మానవత్వం ఉన్న ఎవ్వరైనా జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించాల్సిందేనన్నారు. ఎవరికైనా కష్టం వస్తే శత్రువునైనా పలుకరించి అధైర్యపడవద్దని భరోసా ఇవ్వడం కనీస ధర్మమని.. ఇందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు విచక్షణ కోల్పోయి చేసిన వ్యాఖ్యలు నన్ను ఎంతో మనో వేదనకు గురిచేశాయన్నారు. పార్టీ అధినేతే అలా వ్యవహరిస్తుంటే కిందిస్థాయిలోని మంత్రులు కూడా ఆయనను అనుసరిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలో ఇమడలేక రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానన్నారు.

తనకు టీడీపీ అంటే ఎంతో ఇష్టమని ఆయన చెప్పారు. కేవలం ప్రస్తుత నేతల వ్యవహారశైలి నచ్చకే పార్టీ నుంచి బయటకు వస్తున్నానని రామారెడ్డి తెలిపారు. వ్యక్తిగత దూషణలు, ప్రతీ విషయలోను రాజకీయ లబ్ధిని ఆశిస్తూ పనిచేస్తున్న తీరుతో బాధ కలిగి పదవికి రాజీనామా చేశానన్నారు. మరే ఇతర పార్టీలో చేరాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలేదని రామారెడ్డి పేర్కొన్నారు. తనకు పదవి ఇచ్చి గౌరవించిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.