సీఎం జగన్ రెడ్డి, వైసిపి ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా బిసిలను టిడిపి నుండి దూరం చేయలేవని కింజరాాపు అచ్చెన్నాయుడు అన్నారు. బిసిలకు ఎవరేం చేసారో బహిరంగ చర్చకు సిద్దమా? అని వైసిపి నాయకులను నిలదీసారు.
అమరావతి: ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (atchannaidu) కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రవ్యాప్తంగా 151అసెంబ్లీ సీట్లు గెలిచిన గెలిచిన జగన్ రెడ్డి (ys jagan) కేవలం 10 మంది బీసీలకు మాత్రమే మంత్రి పదువులు ఇచ్చారు... అదే తెలుగుదేశం పార్టీ 103 సీట్లు గెలిచినప్పటికి 9 మంది బీసీలకు మంత్రి పదువులు ఇచ్చామన్నారు. కాబట్టి బిసిలకు ఏదో చేసామంటూ తప్పుడు ప్రచారం చేసినా... చివరకు జగన్ రెడ్డి తలకిందల తపస్సు చేసినా బీసీలనుండి టీడీపీని విడదియ్యలేరని అచ్చెన్న అన్నారు.
బీసీలను నాయకులుగా తయారుచేసిన ఫ్యాక్టరీ టీడీపి అని అచ్చెన్న పేర్కొన్నారు. అలాంటిది బిసిలను టిడిపికి దూరం చేయాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు... కానీ అది అసాధ్యమన్నారు. బీసీలకు ఎవరేం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ఈ మూడేళ్ల జగన్ రెడ్డి పాలనలో బలహీన వర్గాలకు ఏం చేసారో శ్వేతప్రతం విడుదల చేయాలని అచ్చెన్న డిమాండ్ చేసారు.
''జగన్ రెడ్డి కేవలం ఏపీని మూడుముక్కలు చేసి విజయసాయి రెడ్డి (vijayasai reddy), సజ్జల రామకృష్ణా రెడ్డి (sajjala ramakrishna reddy), వైవీ సుబ్బారెడ్డి (yv subba reddy)కి దారాదత్తం చేశారంతే. ప్రజలకు మరీ ముఖ్యంగా బిసిలకు చేసిందేమీ లేదు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు (chandrababu naidu) 19బీసీ కులాలకు శాసనసభలో ప్రాధాన్యమిచ్చారు'' అని అచ్చెన్నాయుడు తెలిపారు.
''ప్రస్తుతం రాష్ట్రప్రజలు వైసిపి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకంగా వున్నాయి. ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకత ఉన్న ప్రభుత్వం ఎక్కడా లేదు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి. ఎప్పుడు చంద్రబాబు నాయుడును అదికారంలో కూర్చోబెట్టి రామరాజ్యాన్ని తెచ్చుకుందామా అని ఏపీ ప్రజానికం వేచిచూస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 160 సీట్లు సాధించి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం'' అని అచ్చెన్న ధీమా వ్యక్తం చేసారు.
''వైసిపి అధికారంలోకి రాగానే ఏర్పాటుచేసిన మంత్రిమండలిని తాజాగా పునర్వ్యవస్థీకరించినా 11మంది పాతవారికే తిరిగి మంత్రిపదవులిచ్చారు. ఇలా తాజాగా పాత, కొత్తవారు కలిపి 25మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసారు. అంటే గత మంత్రివర్గంలో 11 మంది కాకుండా తొలగించిన మంత్రులు అవినీతిపరులా? వారినెందుకు తొలగించారో సమాధానం చెప్పాలి'' అని ప్రశ్నించారు.
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అచ్చెన్న నివాళి అర్పించారు. ఆనాడే సంఘంలోని రుగ్మతలను తొలగించేందుకు విశేష కృషి చేసిన జ్యోతిరావు పూలే మన బీసీ కావడం గర్వకారణమని అచ్చెన్నాయుడు అన్నారు.
ఇదిలావుంటే ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించింది జగన్ సర్కార్. గతంలో మాదిరిగా ఈసారి కూడా ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. మైనారిటీ కోటా నుంచి అంజాద్ బాషా మరోమారు డిప్యూటీ సీఎంగా అవకాశం దక్కింది. ఎస్టీ వర్గం నుంచి పీడిక రాజన్న దొర డిప్యూటీ సీఎంకు అవకాశం కల్పించారు. ఎస్సీ వర్గం నుంచి నారాయణ స్వామికి మళ్లీ డిప్యూటీ సీఎంగా కొనసాగించారు. కాపు సామాజిక వర్గం నుంచి కొట్టు సత్యనారాయణకు, బీసీల నుంచి బూడి ముత్యాల నాయుడుకు డిప్యూటీ సీఎంలుగా నియమించారు.
