అమరావతి: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కట్టడికి ఏపి సర్కార్ మరో అడుగు ముందుకేసింది. కరోనా లక్షణాలున్న వారు క్వారంటైన్, ఆస్పత్రిలో వుండాల్సి వుంటుందని భయపడుతున్నారు. అలాంటివారికోసం ఏపి వైద్యారోగ్య శాఖ మరో కీలక ప్రకటన చేసింది. 

ఇకపై కరోనా లక్షణాలు కలిగిన వారు, అనుమానితుల ఇళ్ల వద్దకే వద్దకే డాక్టర్లు వచ్చి కరోనా వైరస్ టెస్టులు ఉచితంగా చేస్తారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన చేసింది. కాబట్టి ప్రజలెవ్వరు అపోహలకు గురికావద్దని... ధైర్యంగా ముందుకు వచ్చి కేవలం డాక్టర్లకు శాంపిల్స్ ఇవ్వాలని సూచించింది. మిమ్మల్ని మీరు పరీక్షించుకుని సమాజాన్ని, రాష్ట్రాన్నే కాదు యావత్ దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడాలని సూచించారు. 

ఇంట్లోనే కాదు ఇంటి పరిసరాలలో, చుట్టుపక్కల ఎవరయినా అనుమానితులుంటే వివరాలను తెలియజేయాలని... వారిని కూడా పరీక్షించేలా సహకరించాలని సూచించారు. ఇంటివద్ద పరీక్షించిన తర్వాత క్వారంటైన్ సెంటర్ కు గాని, ఆస్పత్రికి గాని తీసుకెళ్లరని... అలాంటి అనుమానాలతో డాక్టర్లకు సహకరించకపోవడం వంటివి చేయవద్దని అన్నారు.  

ఇంటివద్దకే డాక్టర్లు వచ్చి పరీక్షించడంతోపాటు అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇస్తారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు  తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ టెలీ మెడిసిన్ ను కూడా అందుబాటులోకి తెచ్చిందన్నారు. అవసరమైతే ఈ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.