సమస్యల సుడిగుండంలో సతమతమవుతూ.. జ్యోతిష్యుడిని ఆశ్రయిస్తే కష్టాల నుంచి కాపాడతాడనుకున్న వివాహితను వేధించాడో జ్యోతిష్యుడు. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటకు చెందిన వి.శంకర్‌రావు శాస్త్రి స్థానికంగా దివ్యసాయి జ్యోతిష్యాలయాన్ని నిర్వహిస్తూ.. జనానికి జ్యోతిష్యం చెబుతున్నాడు.

ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో కష్టాల్లో ఉన్న మన్నారుపోలూరుకు చెందిన ఓ వివాహిత అతడిని ఆశ్రయించింది.. కష్టాలు తీరే మార్గం చెప్పాల్సిందిగా వేడుకోంది. ఆమెపై కన్నేసిన శంకర్‌రావు తొలుత పూజలు చేయాలంటూ కొంత డబ్బు తీసుకున్నాడు.

అనంతరం తరచూ వివాహితకు ఫోన్ చేసేవాడు.. కష్టాలు తీరాలంటే తొమ్మిది రోజులు పూజలు చేయాలని చెప్పాడు.. అయితే అందుకు కొన్ని నియమాలు పాటించాలని సూచించాడు. ముందుగా నగ్నంగా వీడియో తీసి తనకు పంపాలని..లేదంటే తన పడక గదిలో నగ్నత్వాన్ని చూపించాల్సి ఉంటుందని.. పేర్కొన్నాడు.

అక్కడితో ఆగకుండా ప్రతిరోజు ఫోన్ చేసి.. అసభ్యంగా మాట్లాడేవాడు.. వీటన్నింటినీ రికార్డు చేసిన వివాహిత పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శంకర్‌రావును అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.