అమరావతి భూముల విషయంలో ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీ దత్ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం విమానాశ్రయానికి తన భూములను తీసుకున్న ప్రభుత్వం అమరావతి భూములపై ఒప్పందం చేసుకోవడంపై ఆ పిటిషన్ దాఖలు చేశారు.

అమరావతి: అమరావతి భూములపై ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీ దత్ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరం విమానాశ్రయం కోసం ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి 39 ఎకరాలు ఇచ్చినట్లు ఆయన పిటిషన్ లో తెలిపారు. ఎకరానికి కోటీ 54 లక్షల విలువ చేసే భూమి అది అని చెప్పారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆ భూమికి సరిసమానమైన, అంతే విలువ కలిగిన భూమిని తనకు రాజధాని అమరావతిలో కేటాయిస్తామని సీఆర్డిఎ ఒప్పందం చేసుకుందని చెప్పారు. ఇప్పుడు రాజధానిని ప్రభుత్వం వేరే ప్రాంతానికి తరలించడానికి నిర్ణయించనందని, దాంతో అక్కడి భూమి ఎకరం రూ.30 లక్షలు కూడా చేయని స్థితికి వచ్చిందని ఆయన చెప్పారు. 

తాను ఇచ్చిన 39 ఎకరాలకు రూ. 210 కోట్లు చెల్లించి తీసుకోవాలని ప్రభుత్వాన్ని, విమానాశ్రయం అథారిటీని పార్టీలుగా చేస్తూ అశ్వినీదత్ ఆ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం తాను ఇచ్చిన 39 ఎకరాల రిజిస్ట్రేషన్ విలువ ఎకరానికి రూ. కోటీ 84 లక్షలకు చేరుకుందని ఆయన చెప్పారు. 

భూసేకరణ కింద ఈ భూమికి 4 రెట్లు చెల్లించి విమానాశ్రయం అథారిటీ ఆఫ్ ఇండియా లేదా ఏపీ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టుకోవచ్చునని ఆయన చెప్పారు. అశ్వినీదత్ తరఫును న్యాయవాది జంధ్యాల రవిశంకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.