అసని తుఫాన్ దిశను మార్చుకోవడంతో ఆంధ్రాకు విశాఖ తుఫాను హెచ్చ‌రిక‌ల కేంద్రం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పేర్కొంది. పాతబడిన భవనాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఉండకూడదని సూచించింది. 

అసని తుపాను తన దిశను మార్చుకుని సమీపంలోని కాకినాడ తీరాన్ని తాకబోతోందని విశాఖ తుఫాను హెచ్చ‌రిక‌ల కేంద్రం డైరెక్ట‌ర్ సునంద తెలిపారు. కాకినాడ తీరాన్ని తాకిన త‌రువాత మళ్లీ కాకినాడ-విశాఖపట్నం మధ్య సముద్రంలోకి వస్తుందని ఆయ‌న పేర్కొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు రెడ్ అలెర్ట్ ప్ర‌క‌టించారు. 

‘‘తుఫాను ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు రెడ్ అలెర్ట్ ఇచ్చాం. నిన్నమొన్నటి వరకు ట్రాక్ వాయువ్య దిశను చూపించింది. కానీ గ‌డిచిన 6 గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశ వైపు కదులుతోంది. కాబట్టి ఇది మన ఆంధ్రప్రదేశ్ తీరానికి చాలా దగ్గరగా ఉంది’’ అని సునంద తెలిపారు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుందని ముందుగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు అంచనా వేసినప్పటికీ, అనూహ్యంగా తుపాను కాకినాడ తీరాన్ని తాకబోతోందని ఆమె తెలిపారు.

‘‘ రాబోయే గంటల్లో ఇది వాయువ్యం దిశ‌లో దాదాపు ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో ఉంటుంది. రేపు ఉదయం ఇది తన దిశను మార్చుకుని ఉత్తర-ఈశాన్య దిశలో కదిలి కాకినాడ తీరం-తూర్పు గోదావరి తీరాన్ని తాకి- ఆపై ఈశాన్య దిశలో విశాఖపట్నం తీరంవైపు సమాంతరంగా కదులుతుంది. " అని సునంద చెప్పారు.

తుఫాను ప్రభావంతో కాకినాడ, గనగవరం, భీమునిపట్నం ఓడరేవులకు భార‌త వాతావ‌ర‌ణ శాఖ డేంజర్ సిగ్నల్ నంబర్ 10ని అందించిందని అధికారి తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని రెడ్‌ వార్నింగ్‌ హెచ్చరికలు జారీ చేసింది. గాలి, భారీ వర్షాల కారణంగా నష్టం, విద్యుత్ కోత విష‌యంలో భార‌త వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌జ‌లను అప్ర‌మ‌త్తం చేసింది.

గుడిసెలు దెబ్బతినడం, కచ్చా రోడ్లు, పక్కా రోడ్లకు స్వల్ప నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను కారణంగా వరి పంటలు, అరటి పండ్లు, బొప్పాయి చెట్లు, కొన్ని పండ్ల తోటలు కూడా దెబ్బ తిన‌వ‌చ్చ‌ని తెలిపింది. కొన్ని ప్రాంతాలు విద్యుత్ కోతలు, కమ్యూనికేషన్ లైన్లలో ఆగిపోవచ్చ‌ని పేర్కొంది. ఎందుకంటే చెట్ల కొమ్మలు క‌రెంటు తీగ‌ల‌పై ప‌డి లైన్లను దెబ్బతినే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొంది. 

ప్రజలు సురక్షితమైన ప్రదేశంలో ఉండాలని, తీవ్రమైన నీటి నిల్వ సమస్యలు ఉన్న ప్రదేశాలకు వెళ్లవద్దని చెప్పింది. ఇంటి నుండి బయలుదేరే ముందు ట్రాఫిక్ రద్దీని ట్రాక్ చేయడంతో పాటు ఈ విషయంలో జారీ చేసిన ట్రాఫిక్ నిబంధనలు, సలహాలకు కట్టుబడి ఉండాలని సూచించింది. 

‘‘ గడిచిన ఆరు గంటల్లో పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను 'అసాని' గంటకు 7 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి నేడు పశ్చిమ మధ్యను ఆనుకుని ఉంది. నైరుతి బంగాళాఖాతం కాకినాడ (ఆంధ్రప్రదేశ్)కి ఆగ్నేయంగా 330 కి.మీ దూరంలో, విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కి నైరుతి ఆగ్నేయంగా 350 కిలో మీటర్ల దూరంలో గోపాల్‌పూర్ (ఒడిశా)కి నైరుతి దిశలో 510 కిలో మీటర్లు, పూరీ (ఒడిశా)కి నైరుతి దిశలో 590 కిలో మీటర్ల దూరంలో ఉంది.’’ అని ఐఎండీ పేర్కొంది.