చింతామణి నాటకం రద్దును వ్యతిరేకిస్తూ ఆర్టిస్ట్ అరుగు త్రినాథ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ నాటకాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కళాకారులు రోడ్డున పడ్డారని వివరించారు. దీన్ని అత్యవసర పిటిషన్‌గా స్వీకరించి విచారించాలని కోరారు. ఈ పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు విచారించనుంది. ఇప్పటికే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ రఘురామకృష్టంరాజు పిల్ వేసిన సంగతి తెలిసిందే.
అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం ప్రసిద్ధ చింతామని నాటకాన్ని(Chintamani) రద్దు చేయడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. పలువురు సాహితీకారులు, కళాకారులు ఈ నిర్ణయంపై అభ్యంతరం తెలిపారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంద్రప్రదేశ్ హైకోర్టులో ఇప్పటికే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ప్రముఖ ఆర్టిస్ట్ త్రినాథ్ పిల్(PIL) దాఖలు చేశారు. అరుగు త్రినాథ్ తరఫున న్యాయవాది శ్రావణ్ కుమార్ పిటిషన్ వేశారు. ప్రభుత్వ నిర్ణయంతో కళాకారులు రోడ్డున పడ్డారని ఆయన వాదించారు. అందుకే దీన్ని అత్యవసర పిటిషన్‌గా స్వీకరించాలని కోరారు. మంగళవారం ఈ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court) విచారించనుంది.
చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 7ను సవాల్ చేస్తూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నాటక ప్రదర్శనను నిషేధిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని ఆయన కోరారు. వ్యభిచార వృత్తికి వ్యతిరేకంగా సామాజిక సంస్కర్త కళ్లకూరి నారాయణ రావు చింతామణి నాటాకాన్ని రచించారని వివరించారు. వందేళ్లకు పైగా నాటకాన్ని ప్రదర్శిస్తున్నారని, దీనిపై వేల మంది కళాకారులు జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. కాబట్టి, నాటక ప్రదర్శనను నిలిపేస్తే కళాకారులు రోడ్డున పడతారని పేర్కొన్నారు. నాటకంలోని ఒక పాత్ర కారణంగా మొత్తం నాటక ప్రదర్శనపై నిషేధం విధించడం అనాలోచిత చర్య అని ఆయన పేర్కొన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ జీవోను రద్దు చేయాలని వ్యాజ్యంలో కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవదాసి వ్యవస్థ, వ్యభిచార వృత్తికి వ్యతిరేకంగా సామాజిక సంస్కర్త కళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారని పిటిషన్‌లో వివరించారు. 1920 నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నాటకాన్ని ప్రదర్శిస్తున్నారని, జగన్ ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. ఈ నాటకాన్ని ప్రదర్శిస్తూ వేలమంది కళాకారులు జీవనోపాధి పొందుతున్నారని, ఈ నాటకంపై ఆధారపడి ఉన్న కళాకారులు రోడ్డున పడతారని రఘురామకృష్ణరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ నాటకం ప్రదర్శించిన కళాకారులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గతంలో పలు అవార్డులు, బహుమానాలు ఇచ్చాయనీ, ఈ నాటకం ద్వారా మంచి గుర్తింపు పొందిన కళాకారుడు స్థానం నరసింహారావుకు 1956లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి సత్కరించిందని గుర్తు చేశారు. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ‘చింతామణి’ ఈ నాటకం ఓ ఊపు ఊపేసింది. తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర ప్రధానం. ఆయన ఓ వైశ్యుడు. స్త్రీ వ్యామోహంలో పడి డబ్బు ఎలా పోగొట్టుకున్నాడు. అయితే ఈ పాత్ర ద్వారా తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆర్య వైశ్యులు ఆరోపిస్తున్నారు. తమ మనోభావాలను కించపరుస్తూ చింతామణి నాటకాన్ని ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. మాజీ సీఎం రోశయ్య హయాంలో చింతామణి నాటక ప్రదర్శన రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని వారు చెబుతున్నారు.
చింతామణి నాటకం శతజయంతి వేడుకల్లో ఈ వివాదం మరోసారి తెర మీదికి వచ్చింది. శతజయంతి పేరుతో నాటకాన్ని ప్రదర్శిస్తే ఉద్యమం చేస్తామని ఆర్య వైశ్యులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో నిరసనలు వ్యక్తం కావడంతో చింతామణి నాటకాన్ని నిషేధిస్తుట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
