ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న ముఖ్యమంత్రి నిర్ణయానికి ఏపీ ఆర్టీసీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. మంగళవారం ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబును కార్మిక సంఘాల నేతలు కలిసి సమస్యలపై చర్చించారు.

అనంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ దామోదర్ మీడియాతో మాట్లాడారు. విలీన నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 27 డిమాండ్ల పరిష్కారానికి సంస్థ యాజమాన్యం ఒప్పుకుందని.. ఈ మేరకు లిఖితపూర్వక హామీ కూడా ఇస్తామన్నారని ఆయన పేర్కొన్నారు.

రేపు సచివాలయంలో సీఎం జగన్‌ను కలిసి ఆర్టీసీ విలీనంపై చర్చిస్తామని..సమ్మెపై ప్రకటన చేస్తామని దామోదర్ స్పష్టం చేశారు. రేపటి భేటీలో ఆర్టీసీ విలీనం, డిమాండ్లతో పాటు ఇతర అంశాల గురించి ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఉంది.