ఎన్నో ఆశలు పెట్టుకున్న కొత్త పీఆర్సీ నిరాశను మిగల్చడంతో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. దీనిలో భాగంగా జూన్ 8న విజయవాడలో జేఏసీ నేతలు సమావేశమై ఉద్యమ కార్యచరణపై చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఆర్టీసీ ఉద్యోగులు (apsrtc) ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పీఆర్సీ జీవోలో (prc go) జరిగిన అన్యాయంపై పోరాట కార్యాచరణను చర్చించేందుకు ఈ నెల 8న విజయవాడలో సమావేశమవ్వాలని ఆర్టీసీలోని అన్ని ఉద్యోగ సంఘాలు ,కార్మికులు నిర్ణయించారు. ఆర్టీసీలోని ప్రధాన ఉద్యోగ సంఘాలైన ఎన్ఎంయూ (nmu), ఎంప్లాయిస్ యూనియన్ (employees union) సహా జేఏసీలోని అన్ని ఉద్యోగ సంఘాల నేతలు కార్యక్రమానికి హాజరుకానున్నారు.
కాగా.. 11వ పీఆర్సీకి (11th prc ap) సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ శుక్రవారం జీవోలు విడుదల చేసింది. అయితే ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేశాయి. పీఆర్సీ చైర్మన్ మిశ్రా ఇచ్చిన నివేదిక ప్రకారం.. తమకు జీవోలు ఇవ్వలేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. కొన్ని కేటగిరిల్లో పీటీడీ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగేలా వేతనాల స్థిరీకరణ చేశారని.. అలవెన్సుల్లోనూ కోత విధించారని ఉద్యోగ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 8న జరగనున్న సమావేశంలో వీటిపై చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.
ఇకపోతే.. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను 2020, జనవరిలో ప్రభుత్వంలో విలీనం చేసుకుంది ఏపీ ప్రభుత్వం. వాళ్లను పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో చేర్చింది. అయితే వారికి ఇంతవరకు కేడర్ కేటాయించలేదు. తాజాగా ఇచ్చిన జీవోలో పీటీడీ ఉద్యోగుల స్కేళ్లు ఖరారు చేసింది. ఇక పీఆర్సీ అమలుకు సంబంధించిన ఉత్తర్వుల్లోనూ ఉద్యోగులకు షాకిచ్చింది. కార్మికులకు లబ్ది పొందేలా అశుతోష్ మిశ్రా కమిటీ (ashutosh mishra ias) ఇచ్చిన వివిధ సిఫార్సులను జగన్ ప్రభుత్వం (ys jagan) పక్కనపెట్టింది. సీఎస్ ఆధ్వర్యంలో కార్యదర్శుల కమిటీ ఇచ్చిన నివేదికలోని స్కేళ్లను ఖరారు చేసింది. ఫిట్‌మెంట్ ను తగ్గించడంతో పాటు డీఏలోనూ కోత పెట్టింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు తగ్గాయి. ఇదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది.
