అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులకు రేపు నియామక పత్రాలను అందజేయనున్నారు. సోమవారం ఉదయం 10.30గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నియామక పత్రాలను అందజేయనున్నారు. 

సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు 19.50 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో దాదాపుగా 1.9లక్షల మంది అర్హత సాధించారు. పరీక్షలు పూర్తయిన 10రోజుల్లోనే ఫలితాలను కూడా విడుదల చేసారు. ఈ ఉద్యోగాల్లో చేరే అభ్యర్థులు తొలుత రెండు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ ను పూర్తి చేయవలిసి ఉంటుంది. 

ప్రొబేషన్ పీరియడ్ లో నెలకు 15వేల రూపాయల స్టైపెండ్ ను ప్రభుత్వం చెల్లిస్తుంది. రెండు సంవత్సరాల ప్రొబేషన్ కాలం పూర్తయిన తరువాత శాశ్వత పే స్కేలును అందజేస్తారు. అక్టోబర్ 2వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు ప్రారంభం అవనున్న విషయం తెలిసిందే. ఈ నూతన ఉద్యోగులంతా అదే రోజు విధుల్లో చేరుతారు.