శ్రీకాకుళం: తన స్వగ్రామం నిమ్మాడలో సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేద్దామనే ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి షాక్ తగిలింది. సర్పంచ్ పదవికి అప్పన్న నామినేషన్ దాఖలు చేశారు. పోలీసులు దగ్గరుండి ఆయన చేత నామినేషన్ వేయించారు. నామినేషన్ వేయవద్దని అప్పన్నను అచ్చెన్నాయుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 

శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో సర్పంచ్ పదవికి అచ్చెన్నాయుడి భార్య నామినేషన్ దాఖలు చేశారు. అయితే, అచ్చెన్నాయుడి బంధువే నామినేషన్ వేయాలని ప్రయత్నించాడు. దాంతో అచ్చెన్నాయుడు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయన బెదిరింపులకు కూడా పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

కోటబొమ్మాళి పోలీసు స్టేషన్ లో అప్పన్న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దాంతో పోలీసులు అచ్చెన్నాయుడిని అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. దీంతో నిమ్మాడలో ఏకగ్రీవాలకు కాలం చెల్లినట్లయింది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నిమ్మాడలో పట్టుబట్టి అభ్యర్థిని పోటీకి దించినట్లు భావిస్తున్నారు.
 
తాజా పరిణామంతో కింజారపు కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నట్లు కూడా చెబుతున్నారు. తనను పోలీసులు అరెస్టు చేయడంపై అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ అధినేత చంద్రబాబును ఒప్పంచి హోంమంత్రిని అవుతానని, అప్పుడు తప్పుడు కేసులు పెట్టిన పోలీసుల సంగతి తేలుస్తానని ఆయన అన్నారు.