అమరావతి: అసెంబ్లీలో తెలుగుదేశం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అచ్చెన్నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. కరువు అంశంపై అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడుతుండగా అచ్చెన్నాయుడు అధ్యక్షా అధ్యక్షా అంటూ మధ్యమధ్యలో అడగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సభానాయకుడు, ముఖ్యమంత్రి ఒకరు మాట్లాడుతుంటే గౌరవంగా వినాల్సింది పోయి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటూ అడ్డుతగలడం సంప్రదాయమా అంటూ నిలదీశారు. అసలు ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్టాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. 

గతంలో ఐదేళ్లు ఎలా అయితే ప్రవర్తించారో ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తారనంటే ఎలా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం పరిస్థితి మారిందని చెప్పుకొచ్చారు. వయసు పెరుగుతోంది కానీ మీకు బుద్ధి, బుర్రగానీ పెరగడం లేదని విమర్శించారు. 

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని జగన్ అచ్చెన్నాయుడుకు సూచించారు. అది వయసులోనే కాదు పొజిషన్ లోనూ అన్నింటిలోనూ ఒదిగి ఉండటం నేర్చుకోవాలని సూచించారు. ఒక ముఖ్యమంత్రి సభానాయకుడు హోదాలో మాట్లాడుతుంటే కనీసం ఆ సీఎం కుర్చీకి అయినా గౌరవం ఇవ్వాలనే ఆలోచన కూడా రావడం లేదని కనీసం అదైనా నేర్చుకోండంటూ జగన్ మాజీమంత్రి అచ్చెన్నాయుడుకు సూచించారు.