అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరానికి తెరలేపింది. నామినేటెడ్ పదవుల భర్తీకి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే పలుకీలక నామినేటెడ్ పదవులకు కొందరి పేర్లను సీఎం జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

జగన్ కేబినెట్ లో మంత్రి పదవులు దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నవారికి, పార్టీలో కీలక సేవలు అందించిన వారికి ఈ పదవులు  కట్టబెట్టనున్నారు సీఎం జగన్. వైయస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు ఏపీఐఐసి ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వాల‌ని సీఎం జగన్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.  

అలాగే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఉన్న వాసిరెడ్డి పద్మకు కూడా కీలక పదవి కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. మ‌హిళా క‌మిష‌న్ ఛైర్ ప‌ర్స‌న్‌గా వాసిరెడ్డి ప‌ద్మను నియమించనున్నట్లు సమాచారం. 

మరోవైపు రాజధాని భూములపై అలుపెరగని పోరాటం చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సీఆర్డీఏ చైర్మన్ పదవి కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తానని మాట ఇచ్చారు. 

అయితే సామాజికవర్గ సమీకరణాల నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ మంత్రి వర్గంలో ఛాన్స్ మిస్సయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో కీలకమైన సీఆర్డీఏ ఛైర్మ‌న్‌గా ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న సినీనటుడు మోహన్ బాబుకు కూడా నామినేటెడ్ పదవి ఇవ్వాలని వైయస్ జగన్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్‌గా మోహ‌న్‌బాబకు అవ‌కాశం ఇవ్వనున్నట్లు సమాచారం. 

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ పదవి మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ నిర్వహించారు. ఇటీవలే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఇటీవలే బీజేపీలో చేరారు. 

ఇకపోతే మరో కీలక నేత అంబటి రాంబాబును సైతం కీలక నామినేటెడ్ పదవి వరించనుందని తెలుస్తోంది. ఆర్టీసి ఛైర్మ‌న్‌గా అంబ‌టి రాంబాబు పేరు ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. తెలుగుదేశం పార్టీలో వర్ల రామయ్య ఈ పదవిని నిర్వహించారు. 

మరోవైపు కాపు కార్పోరేష‌న్ ఛైర్మ‌న్‌గా గ్రంధి శ్రీనివాస్ లేదా కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించి వైసీపీలో జెయింట్ కిల్లర్ గా పేర్గాంచిన గ్రంథి శ్రీనివాస్ కు దాదాపు ఫైనల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.  

అలాగే బ్రాహ్మ‌ణ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌విని ద్రోణంరాజు శ్రీనివాస్‌ పేరు వినిపిస్తోంది. అలాగే పోలీస్ హౌసింగ్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్‌గా యేసుర‌త్నం పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన ఆమంచి కృష్ణమోహన్ కు కూడా నామినేటెడ్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సివిల్ స‌ప్ల‌యిస్ క‌మిష‌న్ ఛైర్మ‌న్‌గా ఆమంచి కృష్ణ‌మోహ‌న్ పేరు దాదాపు ఫైనల్ అయినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

అలాగే రాష్ట్ర ఎస్సీ క‌మిష‌న్ ఛైర్మ‌న్‌గా మోషేన్ రాజు, వ‌క్ఫ్ బోర్డు ఛైర్మ‌న్‌గా మ‌హ్మ‌ద్ ముస్తఫాలను నియమించనున్నట్లు తెలుస్తోంది. దివంగత సీఎం వైయస్ జయంతి నాడు నామినేటెడ్ పోస్టులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితులైన  తిరుపతి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డిని ప్రాంతీయ బోర్డు చైర్మన్ గా నియమించనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.