విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ చేతిలో కీలుబొమ్మగా మారాడని ఆరోపించారు. 

గోదావరి మిగులు జలాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదనలకు జగన్ అంగీకరించడం చారిత్రక తప్పిదమేనని విమర్శించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో మీడియాతో మాట్లాడిన తులసిరెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ ఏపీని తెలంగాణకు తాకట్టు పెడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

కేసీఆర్‌ చేతిలో జగన్ కీలుబొమ్మలా‌ మారి ఆంధ్రప్రదేశ్‌ను శాశ్వతంగా‌ ఎడారిగా మార్చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. గోదావరి మిగులు జలాలపై కేసిఆర్ చేసిన ప్రతిపాదనకు జగన్‌ ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించారు. 

కేసీఆర్ పై అంత అభిమానం ఉంటే జగన్ తన సొంత ఆస్తులు పంచుకోవాలని అంతేకాని గోదావరి మిగులు జలాలు విషయంలో ఇష్టం వచ్చిన నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. గోదావరి మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్‌ సొత్తు అని తులసిరెడ్డి స్పష్టం చేశారు. 

రాయలసీమకు నీళ్లు అందివ్వాలన్న పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ దగా చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మాయలోపడి మోసపోవద్దని జగన్ కు హితవు పలికారు. గోదావరి మిగులు జలాలను తెలంగాణ ప్రభుత్వంతో పంచుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని తులసిరెడ్డి స్పష్టం చేశారు.