Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రప్రదేశా? అదానీ ప్రదేశా?.. రాష్ట్రాన్ని వైఎస్ జగన్ దారాదత్తం చేస్తున్నాడు.. శైలజనాథ్ మండిపాటు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ (sake sailajanath) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ జగన్..  ఆంధ్రప్రదేశ్ ను అదానీ ప్రదేశ్‌గా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. 

Apcc chief sailajanath fires on ys jagan govt
Author
Vijayawada, First Published Nov 6, 2021, 4:47 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ (sake sailajanath) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ జగన్..  ఆంధ్రప్రదేశ్ ను అదానీ ప్రదేశ్‌గా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. పోర్టుల నుంచి విద్యుత్ కాంట్రాక్టుల వరకు వారికి కట్టబెట్టేందుకు తెర వెనుక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ కుట్ర చేసారని ఆ సమయంలో విస్తృత ప్రచారం చేసిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినవెంటనే అదే అంబానికి సంబంధించిన నత్వానీకి రాజ్య సభ సీటు ఎలా ఇచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో జగన్ రెడ్డి గెలుపు వెనుక మోదీ, అమిత్ షా, అదానీల పాత్ర ఉందన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని అడిగారు.  ఈ మేరకు శైలజానాథ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 

Also read: ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని టీడీపీ పోరుబాట.. నవంబర్ 9న ధర్నాలు.. జగన్‌పై చంద్రబాబు ఫైర్..

పాదయాత్రలో జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తూ రాష్ట్ర సంపదను ఆదానీ, అంబానీలకి దోచి పెడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం విద్యుత్ కాంట్రాక్టులను కూడా అప్పగించేందుకు సిద్దమయ్యారని  విమర్శించారు. రాష్ట్రానికి వచ్చిన అదానీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ని తాడేపల్లి నివాసంలో కలిసి చర్చించిన రహస్యాలను ప్రజలకు బహిర్గతం చేయాలని శైలజనాథ్ డిమాండ్ చేసారు. అంత దొంగ చాటుగా కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అదానీ కంపెనీ నుంచి రాష్ట్రప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించిన 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ వల్ల రాష్ట్రంపై అదనంగా రూ.లక్షా ఇరవై వేల కోట్ల భారం పడుతుందని  ఆరోపించారు. 

ఈ విద్యుత్ యూనిట్‌కు రూ.2.49కే వస్తుందని జగన్ రెడ్డి సర్కారు చెబుతున్న మాట అసత్యమని, రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు ఇది చేరేసరికి యూనిట్ ధర రూ.3.50 నుంచి రూ.4.50 అవుతుందని చెప్పుకొచ్చారు. ఇది రైతుల కోసం పెట్టిన ఉచిత విద్యుత్ స్కీమ్ అమలుకు కొంటున్నది కాదని.. అదానీ కోసం ప్రభుత్వం చేస్తున్న స్కామ్ అని ఆరోపించారు. ఓపక్క సౌర విద్యుత్ ధర యూనిట్ రూ.2లోపే దిగిపోతున్న ఈ సమయంలో ఇంత ఎక్కువ ధర పెట్టి అక్కడి నుంచి కరెంటు కొనాల్సిన అవసరం ఏమిటని శైలజనాథ్ ప్రశ్నించారు.

 రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించాల్సింది పోయి వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి కరెంటు ఉత్పత్తి చేస్తే అధిక ధరకు మనమెందుకు కొనాలని నిలదీశారు. ప్రజలు చెమటోడ్చి సంపాదించుకున్న దాన్ని దేశంలోనే రెండోఅతిపెద్ద ధనవంతుడైన వ్యక్తికి దోచిపెట్టడానికే ప్రభుత్వం, 10వేలమెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంచేసుకుందా? అని ప్రశ్నించారు. 2024లో విద్యుత్ సరఫరాకు ఇప్పుడున్న అధికధరల ప్రకారం ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చిందని ప్రశ్నించారు. 2024 యూనిట్ విద్యుత్ రూ.1.26పైసలకు వస్తుందని చెబుతుంటే.. ఈప్రభుత్వం యూనిట్ రూ.3.50పైసల నుంచి రూ.4.50పైసలకు కొనడం అన్యాయంకాదా? అని శైలజనాథ్ ప్రశ్నించారు.

Also read: YS Jagan: నవంబర్ 9న శ్రీకాకుళం జిల్లాకు సీఎం వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇదే..


గంగవరం పోర్టులో అదానీకి 89.6% వాటా, గంగవరం పోర్టు లిమిటెడ్(జీపీఎల్)లో డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి చెందిన 58.1 శాతం వాటాను రూ.3,604 కోట్లతో కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరినట్లు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీఎస్ఈజెడ్) లిమిటెడ్ తెలిపింది. జీపీఎల్లో వార్బర్గ్ పింకస్ సంస్థకు చెందిన 31.5 శాతం వాటాను మార్చి 3న ఏపీఎస్ఈజెడ్ కొనుగోలు చేసిందని, వార్బర్గ్ పింకస్, డీవీఎస్ రాజు, కుటుంబ సభ్యుల నుంచి కొనుగోలు వాటాను కలిపితే జీపీఎల్లో తమ వాటా 89.6 శాతానికి చేరుకుందని ఆ సంస్థ పేర్కొందని వివరించారు.

కృష్ణపట్నం పోర్టులో పూర్తిగా 100 శాతం వాటాను అదానీ గ్రూపు కైవసం చేసుకుందని, ఇప్పటికే 75 శాతం వాటాను కలిగి ఉన్న అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) తాజాగా మిగిలిన 25 శాతం వాటాను కొనుగోలు చేసిందని, కృష్ణపట్నం పోర్టులో విశ్వ సముద్ర హోల్డింగ్స్‌కు చెందిన 25 శాతం వాటాను రూ.2,800 కోట్లకు కొనుగోలు చేసిందని, దీంతో కృష్ణపట్నం పోర్టులో వాటా 75 శాతం నుంచి 100 శాతం వరకు చేరిందని, గతేడాది అక్టోబర్ నెలలో 75 శాతం వాటాను కొనుగోలు చేసినప్పుడు ఆర్థిక ఏడాది 2021 ఎబిట్టాకు(చెల్లించాల్సిన పన్నులు, వడ్డీలు, తరుగుదల వంటివన్నీ లెక్కలోకి తీసుకొని లెక్కించే ఆదాయం) 10.3 రెట్లు అధికంగా కృష్ణపట్నం పోర్టు విలువను రూ.13,765 కోట్లుగా మదింపు వేసినట్లు తెలిపిందన్నారు. ఎక్కువ ధరకు అదానీ కరెంటు కొనడం వల్ల దానిని పేదలు, సామాన్యులే కరెంటు బిల్లుల రూపంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు తప్పని సవాల్ చేస్తున్నానని, దమ్ముంటే జవాబివ్వాలని డాక్టర్ సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేఖ విధానాలపై ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios