దసరా శరన్నవరాత్రి వేడకలు ఎంతో వైభవంగా జరిగే విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో అన్యమత ప్రచారం జరగడంపై ఆగ్రహించిన టిడిపి నేత వేమూరి ఆనంద్ సూర్య వెంటనే ఓ ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం జగన్ కు లేఖ రాసారు.
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మవారి సన్నిధిలో ఎంతో విశిష్టమైన దసరా శరన్నవరాత్రుల సమయంలో అన్యమత ప్రచారం జరుగుతోందని ఏపీ టిడిపి ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య ఆరోపించారు. స్వయంగా ఓ ప్రభుత్వం అధికారి నేతృత్వంలోనే మతప్రచారం జరుగుతోందని... సదరు ఉన్నతాధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం జగన్ కు లేఖ రాసారు.
ఆనంద్ సూర్య సీఎం జగన్ కు రాసిన లేఖ యధావిధిగా:
వైయస్ జగన్మోహన్‌రెడ్డి గారికి,
ముఖ్యమంత్రివర్యులు
ఆంధ్రప్రదేశ్.
విషయం: అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్న సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ టి.విజయకుమార్‌రెడ్డిపై చర్యల కొరకు...
ఆర్యా!
సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ అంటే ప్రతిరోజూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కీలక బాధ్యత. అటువంటి అత్యున్నతమైన పదవిలో ఉండి అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్న విషయాన్ని ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకువస్తున్నాను.
ప్రపంచవ్యాప్తంగా భక్తుల మన్ననలు పొందుతున్న విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవాలయ పరిధిలో అక్టోబర్ 7,2021న విజయ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న ఎల్‌ఈడి స్క్రీన్‌లో అన్యమత ప్రచారం నిర్వహించి ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యవహరించడంతో పాటు లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే నవరాత్రుల సమయంలో ఇటువంటి చర్యలకు పాల్పడడం క్షమార్హం. దేశ విదేశాల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఐ&పీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రచారంపై తీవ్ర ఆగ్రహంతోపాటు ఎల్‌ఈడీ స్క్రీన్లను కూడా ధ్వంసం చేయడం జరిగింది.
విజయకుమార్‌రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్రైస్తవ మిషనరీలు నిర్వహించడంతోపాటు బలవంతంగా మత మార్పిడులు జరుగుతున్నాయనే సమాచారం ఉంది. అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్న సమాచార పౌరసంబంధాలశాఖ కమీషనర్ విజయకుమార్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
(వేమూరి ఆనంద్ సూర్య)
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్.
