Asianet News TeluguAsianet News Telugu

ఏపిలో కరోనా కల్లోలం: టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవికి కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా వైరస్ ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. తాజాగా టీడీపీఎమ్మెల్సీ బిటెక్ రవికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. సచివాలయంలో 60 మందికి కరోనా సోకింది.

AP TDP MLC BTech Ravi infected with Coronavirus
Author
Amaravathi, First Published Apr 17, 2021, 11:09 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ప్రజాప్రతినిధులు కూడా దీని బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవికి కరోనా వైరస్ సోకింది. కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే బిటెక్ రవికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శి పద్మారావు మృత్యువాత పడ్డారు. ఆయన శనివారం తెల్లవారుజామున మరణించారు. దాదాపు 60 మంది సచివాలయ ఉద్యోగులకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. 

సచివాలయంలో ప్రతి శుక్రవారం కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగా శుక్రవారం నాడు 200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 60 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఉద్యోగుల కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. 

కరోనాతో మృతి చెందిన పద్మారావు భార్య కూడా సచివాలయంలోనే పనిచేస్తున్నారు. ఆమెకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు ఐఎఎస్ అధికారులకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో శాఖాధిపతులు (హెచ్ఓడీలు) ఎవరూ సచివాలయానికి రావడం లేదు. హెచ్ఓడీలు విజయవాడ, గుంటూరుల్లోని తమ కార్యాలయాల నుంచే పనిచేస్తున్నారు. 

కరోనా వైరస్ వ్యాపిస్తున్న కారణంగా తమకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది.

కాగా, గన్నవరం విమానాశ్రయానికి మరో 5 లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి.తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అవి చేరాయి. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్ డోసులు వెళ్తాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కొరత కొంత మేరకు తీరనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios