గుంటూరు: విధ్వంసం, విచ్ఛిన్నం రెండు కళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ రెడ్డి పాలన సాగుతోందని రాష్ట్ర టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 
ప్రశాంత విశాఖ నగరాన్ని కక్ష సాధింపు చర్యలకు కేరాఫ్ అడ్రస్ చేశారన్నారు. ఇప్పుడు వైసీపీ నేతల పంపకాల్లో భాగంగానే ఫ్యుజన్ ఫుడ్స్ ఖాళీ చేయిస్తున్నారు అచ్చెన్న ఆరోపించారు. 

''ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు క్రూరత్వమే తప్ప మానవత్వం లేదు. అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం, అఘాయిత్యాలు, దురాగతాలు తప్ప అభివృద్ధి అవసరం లేదు. రాజ్యాంగంపై గౌరవం లేదు, ప్రజాస్వామ్యమంటే లెక్కలేదు. నిరంకుశ క్రూర స్వభావంతో ప్రశ్నిస్తే సంకెళ్లు, ఎదురు తిరిగితే జైలు అన్నట్లు రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన సాగుతోంది'' అని అచ్చెన్న మండిపడ్డారు. 

''జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నేటి విశాఖ ఘటన పరాకాష్ట. విశాఖ నగరంలోని సిరిపురంలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడనే ఏకైక కారణంతో ఫ్యూజన్ ఫుడ్స్ భవనాన్ని ఖాళీ చేయించడం ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు నిలువుటద్దం. హోటల్ లీజు గడువు 2024 వరకు ఉన్నప్పటికీ పండగ పూట హడావుడిగా ఖాళీ చేయించడం ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఏ విధంగా ఖాళీ చేయిస్తారు.?'' అని ప్రశ్నించారు. 

''దీపావళి నాడు పబ్లిక్ హాలిడే. ఆ రోజు ప్రభుత్వ అధికారులంతా సెలవులో ఉన్నారు. కానీ.. పండగపూట ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా అధికారులపై ఏ స్థాయిలో ఒత్తిడులున్నాయో అర్ధం చేసుకోవచ్చు. 2024 వరకు గడువు ఉందని హోటల్ యజమాని హర్ష అన్ని పత్రాలు చూపిస్తున్నా.. అధికారులు పట్టించుకోకుండా హోటల్ ఖాళీ చేయించడం ప్రభుత్వ నిరంకుశత్వం కాదా.? నోటీసులు కూడా ఇవ్వకుండా ఖాళీ చేయించడం అధికార దుర్వినియోగం కాదా.?''అని నిలదీశారు. 

''లీజులు లేకుండా ఇష్టానుసారంగా వైసీపీ నేతలు ఇసుక తవ్వుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీకి పాల్పడుతుంటే పట్టించుకోని అధికారులు.. క్రమం తప్పకుండా లీజు సొమ్ము చెల్లిస్తూ, ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యాపారం చేసుకుంటున్న టీడీపీ సానుభూతిపరుడి వ్యాపారాలను స్వాధీనం చేసుకోవడం కక్ష సాధింపు చర్యలు కాదా.? లీజు గడువు ముగియకుండా భవనాన్ని స్వాధీనం చేసుకోవాలనుకోవడం జగన్ రెడ్డి దుర్మార్గ పాలనకు నిదర్శనం'' అన్నారు. 

''మొన్న సబ్బం హరి ఇంటి ధ్వంసం, నిన్న గీతం కాలేజీ భవనాలు ధ్వంసం, నేడు టీడీపీ సానుభూతిపరుడు హర్షకు చెందిన ఫ్యుజన్ ఫుడ్స్ హోటల్ విధ్వంసం జగన్ రెడ్డి కక్ష పూరిత పాలనకు నిలువుటద్దాలు. రోజుకో వరుస ఘటనలతో ప్రశాంత విశాఖ నగరాన్ని జగన్ రెడ్డి.. విధ్వంసానికి, విశృంఖల అకృత్యాలకు అడ్డాగా తయారు చేస్తున్నారు. సక్రమంగా సంపాదించుకున్న ఆస్తుల్ని కూడా అక్రమాస్తులంటూ జగన్ సర్కారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణం'' అన్నారు. 

''నిన్నటికి నిన్న వైసీపీ నేతలు వాటాల పంపాకాల్లో తేడాలొచ్చి డీడీఆర్సీ సమావేశంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. వారి అవినీతి, అక్రమాలు, వాటాల పంపకాల్లో విభేధాలు బయటకు పొక్కడంతో టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. వారి ఆస్తులను పంచుకోవడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. నేడు ఈ హోటల్ భవనం అకస్మాత్తుగా ఖాళీ చేయించడం కూడా వైసీపీ నేతల పంపకాల్లో భాగమే. విశాఖ నగరంలోని ప్రతి వ్యాపార సంస్థను తన గుప్పిట్లో పెట్టుకోవాలని విజయసాయిరెడ్డి అండ్ కో ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారి వ్యాపారాలను స్వాధీనం చేసుకుంటున్నారు'' ఆరోపించారు. 

''ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి పగ, ప్రతీకారం, కూల్చి వేతలు, అణచివేతలు తప్ప 18 నెలల జగన్ రెడ్డి పాలనలో  చేసిందేమిటి.? ప్రజలు అధికారం ఇచ్చింది రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపడానికా.. లేక అకృత్యాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చడానికా.? జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని జరగలేదు. కానీ.. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు అన్న జిల్లాల్లో అకృత్యాలు, విధ్వంసాలు మాత్రం లెక్కకు మించి జరుగుతున్నాయి. ప్రజావేధిక కూల్చివేతతో మొదలైన విధ్వంసం సామాన్యుడి బతుకుల్ని రోడ్డున పడేసే వరకు వచ్చింది. ఇంకా సుపరిపాలన అంటూ జగన్ రెడ్డి జబ్బలు చరుచుకోవడం చూస్తే సిగ్గేస్తోంది. ఇప్పటికైనా జగన్ రెడ్డి తన కక్ష సాధింపును మానాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని గుర్తుంచుకోవాలి'' అని అచ్చెన్నాయుడు సూచించారు.