గుంటూరు: ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక ప్రభుత్వంగా జగన్ సర్కారు వ్యవహరిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు రోడ్డెక్కి నిరసన తెలిపేలా చేసిన ఘనత జగన్ సర్కారుకే దక్కిందన్నారు. ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు నిలబెట్టి.. దేశం యావత్తు నివ్వెరపోయేలా వైసిపి ప్రభుత్వం వ్యవహరించిందని... ప్రపంచం ముందు రాష్ట్ర ఉపాధ్యాయుల పరువు ప్రతిష్టలను మంటగలిపారని అచ్చెన్న మండిపడ్డారు. 

''సీనియారిటీ ప్రకారం జరగాల్సిన ఉపాధ్యాయ బదిలీల్లోనూ రాజకీయ జోక్యం, రాజకీయ నేతల అనుయాయులకు కట్టబెట్టాలనే ప్రయత్నాలు అత్యంత హేయం. ఉపాధ్యాయులంతా వెబ్ కౌన్సెలింగ్ వద్దని, మాన్యువల్ కౌన్సెలింగ్ మాత్రమే నిర్వహించాలని డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం ఏకపక్షంగా వెబ్ కౌన్సెలింగ్ కు వెళ్లడం ఎవరి కోసం?'' అని ప్రశ్నించారు. 

''వెబ్ కౌన్సెలింగ్ లో ఒక్కో ఉపాధ్యాయుడు దాదాపు 2వేల ఆప్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ రెండువేల ఆప్సన్ష్ లో ఎక్కడకు బదిలీ జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అదే మాన్యువల్ అయితే సీనియారిటీ ప్రకారం బదిలీలు జరుగుతాయి. సీనియారిటీతో సంబంధం లేకుండా.. తమ వారికి అనుకున్న ప్రాంతంలో బదిలీలు చేసుకునేందుకు ఏకంగా 50-60 శాతం ప్రాంతాలను బ్లాక్ చేయడం నీతిమాలిన రాజకీయమే.బదిలీ ప్రాంతాలను బ్లాక్ చేయడానికి నిరసనగా టీచర్లు ముట్టడి కార్యక్రమాలు, డీఈవో ఆఫీసుల ముందు ధర్నాలు, విజయవాడ ధర్నా చౌక్ లో నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం, పైగా వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేయడం సిగ్గుచేటు'' అని విమర్శించారు. 

''చివరకు ఈ నెల16న అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడమంటే ప్రభుత్వ వైఖరి వారిని ఎంత వేధించిందో అర్ధమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో.. ఉపాధ్యాయుల సూచనలు, సలహాలు, వారి అభిప్రాయాల మేరకే కౌన్సెలింగ్ జరిగింది. మెరిట్, సీనియారిటీని కాదని ఏనాడూ బదిలీలు చేపట్టిన దాఖాలాలే లేవు. కానీ.. ఇప్పుడు అంతా మా ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తూ విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు'' అన్నారు. 

''5డీఆర్సీలు, 11వ పీఆర్సీ ఎప్పుడిస్తారో, ఎంతిస్తారో కూడా చెప్పడం లేదు. మార్చి, ఏప్రిల్ నెలల సగం జీతం ఇంత వరకు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. ఐఆర్ విషయంలో దగా చేశారు. ఇప్పుడు బదిలీల విషయంలో వేధింపులకు పాల్పడడం ప్రభుత్వ నిరంకుశ విధానాలకు నిదర్శనం. ఉపాధ్యాయులకు విధ్యేతర పనులు అప్పగించొద్దని 2009 విద్యా చట్టం, 2020 కేంద్ర ఎడ్యుకేషనల్ పాలసీ స్పష్టం చేస్తున్నా నాడు-నేడు పేరుతో అవస్థలకు గురి చేశారు. మద్యం దుకాణాల ముందు పర్యవేక్షణ పేరుతో నిలబెట్టి పరువు తీశారు'' అన్నారు. 

''కరోనా విజృంభిస్తున్నందున స్కూల్స్ తెరవొద్దని విద్యార్ధుల తల్లిదండ్రులు, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, వైద్యారోగ్య నిపుణులు హెచ్చరించినా పట్టించుకోకుండా స్కూల్స్ తెరిచి వందలాది మంది టీచర్లు, పిల్లలు కరోనా బారిన పడేలా చేశారు. పదుల సంఖ్యలో ఉపాధ్యాయుల మరణాలకు ప్రభుత్వ ఏకపక్ష విధానాలే కారణం. ఆ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. ఇప్పటికైనా జగన్ రెడ్డి ఏకపక్ష విధానాలను పక్కన పెట్టి.. వెబ్ కౌన్సెలింగ్ ను రద్దు చేయాలి. మాన్యువల్ విధానాన్ని పునరుద్ధరించాలి'' అని అచ్చెన్నాయుడు కోరారు.