అమరావతి: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను కూడా వైసిపి ప్రభుత్వం రాజకీయ రంగు పులమడానికి ప్రయత్నిస్తోందని... ఆ చర్యలను అడ్డుకోవాలంటూ డిజిపి గౌతమ్ సవాంగ్ కు రాష్ట్ర టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. మహిళల రక్షణ కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం షీటీమ్స్ ను ఏర్పాటుచేసి వారికి దాదాపు 800 పైగా  వాహనాలను సమకూర్చిందని... నేడు ఆ వాహనాలకే వైసిపి రంగులు అద్ది తిరిగి పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ డిజిపి అచ్చెన్న లేఖ రాశారు.

డిజిపికి అచ్చెన్నాయుడు రాసిన లేఖ యధావిధిగా:  

తేది : 22.12.2020

డిప్యూటీ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌,

గవర్నమెంట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌.

విషయం: గుంటూరు జిల్లాలో పోలీస్‌ షీ టీమ్స్‌ వాహనాలకు వైకాపా రంగులను వేసి పంపిణీ చేయడంపై చర్యల కొరకు...

గుంటూరు జిల్లా అర్బన్‌ ఎస్పీ చేతుల మీదుగా డిసెంబర్‌ 21,2020 నాడు పోలీస్‌ షీ టీమ్స్ కు వైకాపా రంగులు వేసిన ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు. రాజకీయ పార్టీకి సంబంధించిన రంగులను ప్రభుత్వ వాహనాలపై ముద్రించడమే కాకుండా స్వయంగా ప్రభుత్వ అధికారే వాటిని ప్రారంభించి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు. మహిళల రక్షణలో భాగంగా గత ప్రభుత్వం షీటీమ్స్ ను బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 800 వాహనాలకు పైగా సమకూర్చింది. నేడు ఆ వాహనాలకే వైకాపా రంగులు అద్ది తిరిగి పంపిణీ చేశారు. ఇప్పటికే రంగుల విషయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను  సర్వోన్నత న్యాయస్థానం ఎండగట్టిన విషయం విదితమే. 3500 కోట్లు ప్రజా ధనాన్ని వృధా చేశారు. పోలీసు వాహనాలకు వైకాపా రంగుల వాడటకంపై సమగ్ర విచారణ జరపాలి. బాధ్యులపై చర్యలు తీసుకుని ఇలాంటి పనులు పునరావృతం కాకుండా చూడాలి.

రాత్రింబవళ్లు శాంతిభద్రతలను సంరక్షిస్తూ ప్రజల జీవితాలకు, ఆస్తులకు రక్షణ కల్పించే పోలీసులకు రాజకీయ ముద్ర వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకువస్తున్నాము. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే వాహనాలకు వైకాపా రంగులు వేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి. ఇది రాష్ట్ర పోలీసు వ్యవస్థకే మాయని మచ్చగా మారుతుంది. వాహనాలకు వేసిన రంగుల వల్ల వైకాపా ప్రచార రథాలుగా మారిపోయాయి. ప్రజలంతా పోలీస్ వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేసే విధంగా ఉంది. 
                                 

కింజరాపు అచ్చెన్నాయుడు,

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు.