పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పూర్ ఐఐటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నకిరికల్ మండలం బెల్లగుండ్ల గ్రామానికి చెందిన హనిమిరెడ్డి అనే విద్యార్థి ఎంటెక్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్‌లో ద్వీతియ సంవత్సరం చదువుతున్నాడు. క్యాంపస్‌ ఆవరణలోని మదన్‌మోహన్ మాలవ్య హాస్టల్‌లో ఉంటున్నాడు..

ఈ క్రమంలో బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో స్నేహితులు అతని గదికి వచ్చి పిలిచారు.. తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో సెక్యూరిటీ సిబ్బందికి తెలిపారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో సెక్యూరిటీ సిబ్బంది తలుపులు బద్ధలుగొట్టి చూడగా హనిమిరెడ్డి ఉరికి వేలాడుతూ కనిపించాడు.

అతన్ని కిందకి దించి క్యాంపస్‌లోని బి.సి.రాయ్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు హనిమిరెడ్డి మరణవార్తతో అతని స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.