కొత్త జిల్లాలకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలలో 90 శాతం అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కరించారని ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు.  అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాల పునర్ విభజన చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. 

ఏపీలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళిక శాఖ (ap planning department) కార్యదర్శి విజయ్ కుమార్ (vijay kumar) శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రెండ్రోజుల్లో తుది నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. ఏప్రిల్ 4న సీఎం జగన్ కొత్త జిల్లాలను ప్రారంభిస్తారని విజయ్ కుమార్ వెల్లడించారు. ఆ తర్వాత కొత్త జిల్లాల జాబితాను కేంద్ర ప్రణాళిక శాఖకు పంపుతామన్నారు. పూర్తి శాస్త్రీయ విధానంలో, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాల పునర్ విభజన చేపట్టినట్టు విజయ్ కుమార్ వివరించారు. జిల్లాల విభజనపై ప్రజల నుంచి 17,500కి పైగా సూచనలు, అభ్యంతరాలు రాగా, 284 అంశాలపై విజ్ఞప్తులు అందాయని ఆయన తెలిపారు. అయితే సీఎం జగన్ 90 శాతం అంశాలపై సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకున్నారని విజయ్ కుమార్ పేర్కొన్నారు.

మరోవైపు.. ఏప్రిల్ 2, 3 తేదీల్లో అందుబాటులో ఉండాలని అన్ని శాఖల ఉన్నతాధికారులకు ఏపీ ప్రభుత్వం (ap govt) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ (sameer sharma) గురువారం మెమో జారీచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విధులకు గైర్హాజరు కావొద్దని సీఎస్ స్పష్టం చేశారు. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులతోపాటు విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు.. హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో జిల్లాల విభజనకు సంబంధించిన కార్యాచరణ ఉండటంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం అధికారులందరితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఏప్రిల్ 4వ తేదీన సీఎం జగన్‌ చేతుల మీదుగా కొత్త జిల్లాల ప్రారంభోత్సవం జరగనుంది. ఆ రోజు నుంచే కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభం కానుంది. ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్య కొత్త జిల్లాల అవతరణ కార్యక్రమం జరగనుంది. తొలుత కొత్త జిల్లాల నుంచి ఉగాది రోజున పాలన ప్రారంభించాలని భావించారు. అయితే ముహుర్తం, ఇతర అంశాలను పరిగణలోని తీసుకున్న ప్రభుత్వం.. ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లా ప్రారంభోత్సవం జరపాలని నిర్ణయించింది. 

అంతకుముందు బుధవారం నాడు సీఎం YS Jagan కొత్త జిల్లాలపై సమీక్ష నిర్వహించారు.. పది కాలాలు గుర్తుండేలా కొత్త జిల్లాల భవనాల నిర్మాణం చేయాలని ఆయన కోరారు. New Districts భవన నిర్మాణాల కోసం అనువైన స్థలాల ఎంపికను పూర్తి చేయాలని CM ఆదేశించారు. కొత్ కలెక్టరేట్ల నిర్మాణం కోసం కనీసం 15 ఎకరాల స్థలం ఉండేలా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం అద్దె భవనాలు తీసుకొన్న జిల్లాల్లో కొత్త భవనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కోరారు. కలెక్టర్, జిల్లా ఎస్పీ కార్యాలయాలు ఒకే భవనంలో ఉండాలని జగన్ సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల 600 సలహాలు, సూచనలు వచ్చాయన్నారు. వీటిని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కొత్త జిల్లాల్లో సిబ్బంది, ఉద్యోగుల పోస్టింగ్ విషయమై సిక్స్ పాయింట్స్, రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా పాటించినట్టుగా సీఎంకు అధికారులు వివరించారు.