బెంగళూరులో నివసిస్తున్న ఏపీకి చెందిన ఓ చిన్ని కుటుంబం మూడు హత్యలు, ఒక ఆత్మహత్యతో అంతమైపోయింది. భార్య, ఇద్దరు కూతుళ్ల మెడలను చేతులత నులిమి చంపేసిన ఆమె భర్త అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబం కాలగర్భంలో కలిసిపోయింది. భార్య గొంతు నులిమి చంపేసి, ఇద్దరు పిల్లలనూ హత్య చేసిన ఆ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటన జులై 31వ తేదీ రాత్రి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ కుటుంబం మొత్తంగా అంతమైపోవడం వెనుక కారణాలు ఇంకా తెలియడం లేదు. అంతా మిస్టరీగానే ఉన్నది. ఎలాంటి డెత్ నోట్ కూడా లభించలేదు.
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 31 ఏళ్ల వీరార్జున విజయ్ కుటుంబంతోపాటు బెంగళూరులో ఉంటున్నాడు. యూరోఫిన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉన్నాడు. 29 ఏళ్ల భార్య హేమావతి హోం మేకర్. ఇద్దరు కూతుళ్లు.. రెండేళ్ల మోక్ష మేఘనయన, ఎనిమిది నెలల సృష్టి సునయన వీరి సంతానం. ఆరేళ్ల క్రితం వీరార్జున విజయ్, హేమావతికి పెళ్లైంది. మూడేళ్ల క్రితం వారు బెంగళూరుకు మారారు.
నేర ఘటనాస్థలిని పరిశీలిస్తే భార్య హేమావతిని గొంతు నొక్కి చంపేశాడని, అలాగే రెండేళ్ల, ఎనిమిదేళ్ల కూతుళ్లనూ చంపేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత వీరార్జున విజయ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నారు.
ఈ మరణం వెనుక కారణాలు తెలియలేవు. సాధారణంగా ఉండే దంపతుల మధ్య విభేదాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మొదలైన వంటి విషయాలను పోలీసులు పరిశీలించారు. కానీ ఫలితం లేకపోయింది.
Also Read: పార్లమెంటులో మరోసారి నెహ్రూపై కామెంట్లు.. అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఎందుకు సంతోషించాడు?
ఏపీలో నివసించే హేమావతి చిన్న తమ్ముడు సాయి ప్రసాద్ అక్కకు పలుమార్లు ఫోన్ చేసినా వరుసగా రెండు రోజులపాటు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారుపడ్డాడు. మంగళవారం ఉదయం బెంగళూరుకు వచ్చి సీగెహల్లిలొ సాయి గార్డెన్స్‌లోని అక్క నివసించే విల్లాకు తాళం వేసి ఉండటాన్ని చూశాడు. లోపలి నుంచి దారుణమైన దుర్గందం వచ్చింది. ఇరుగు పొరుగు వారిలోనూ అనుమానాలు పెరిగాయి. చివరకు ఆ డోర్ పగులగొట్టి లోనికి చూస్తే.. నలుగురి మృతదేహాలు దారుణంగా కుళ్లిపోయి కనిపించాయి.
ఈ ఘటన ఎందుకు జరిగిందో తమకు తెలియదని పోలీసులు చెప్పారు. సాయి ప్రసాద్ తీవ్ర శోకంలో ఉన్నాడని, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.
రెండు మొబైల్ ఫోన్లు, అన్ని ల్యాప్‌టాప్‌లను తదుపరి దర్యాప్తు కోసం స్వాధీనం చేసుకున్నట్టు వైట్ ఫీల్డ్ డీసీపీ ఎస్ గిరీష్ తెలిపారు.
