అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి, ఏపీ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య పంచాయతీ జేడీ జీవీ సాయిప్రసాద్ మీద వేటుకు దారి తీసింది. ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ సాయిప్రసాద్ ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ విధల నుంచి తొలగించారు. తమ కార్యకలాపాలాకు పథకం ప్రకారం విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణపై ఆయనను విధుల నుంచి తప్పించారు.

కీలకమైన జేడీపై ఇంతటి తీవ్రమైన చర్యలు తీసుకోవడం కమిషన్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇతర ప్రభుత్వ శాఖల్లో ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా విధులు నిర్వహించడానికి వీలు లేదని కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డారని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, అందువల్ల సాయి ప్రసాద్ ను విధుల నుంచి తొలగిస్తున్నామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను జారీ చేసి ఉత్తర్వులో స్ఫష్టం చేశారు. 

పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కమిషన్ లో కీలకమైన జేడీ 30 రోజుల పాటు సెలవు కోసం లేఖ రాసి అనుమతి తీసుకోకుండా వెళ్లిపోయారని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని కమిషనర్ తెలిపారు. తనతో పాటు మరికొంత మంది ఉద్యోగులు సెలవుపై వెళ్లే విధంగా సాయిప్రసాద్ ప్రభావితం చేశారని ఆయన ఆరోపించారు. 

ఉద్యోగులందరూ సామూహిక సెలవుపై వెళ్తే కమిషన్ కార్యకలాపాలు స్తంభించి ఎన్నికలకు విఘాతం కలిగించవచ్చునని సాయి ప్రసాద్ తెర వెనక ప్రణాళిక రచించినట్లు ఆరోపించారు. సెలవుపై వెళ్లడానికి మిగతా ఉద్యోగులు నిరాకరించారని చెప్పారు. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని సాయి ప్రసాద్ ను ఆర్టికల్ 243కె రెడ్ విత్ 324 ప్రకారం అధికారాలు ఉపయోగించి కమిషన్ నుంచి తొలగిస్తున్నట్లు రమేష్ కుమార్ తెలిపారు.

సాయి ప్రసాద్ ను విధుల నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్ద చేయాలని, తిరిగి ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఏపీ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ చైర్మన్ టీఎంబీ బుచ్చిరాజు, చైర్మన్ శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శి శంకర్ సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. సాయి ప్రసాద్ ను అన్యాయంగా తొలగించారని వారు విమర్శించారు.