అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. అందుకు సంబంధించి ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపేయాలని ఆయన ఆదేశించారు. 

ఆ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు సర్క్యులర్ జారీ చేశారు. దానివల్ల అమ్మ ఒడి పథకం ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీపై ఆంక్షలు విధించారు.

అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఇప్పటికే నెల్లూరు చురుగ్గా సన్నాహాలు సాగుతున్నాయి. సంక్షేమ పథకాలపై గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారు. వాటికి బడ్జెట్ కేటాయింపులు కూడా జరిగాయి. ఆ పథకాలు ఓటర్లను ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటిని ఆపేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను జారీ చేసిన సర్క్యూలర్ లో సూచించారు. 

గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని వైఎస్ జగన్ ప్రభుత్వం అంటోంది. ఈ స్థితిలో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలును ఆపేస్తుందా, లేదా అనేది వేచి చూడాల్సిందే.