అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారు. ఎన్నికల విషయంలో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. 

ఎన్నికల నిర్వహణలో పాల్గొనే ఉద్యోగులకు ఆయన కీలకమైన సూచనలు చేశారు. ఉద్యోగులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా శానిటైజర్లు, మాస్కులు సరఫరా చేయాలని తెలిపారు. 

ఫ్రంట్ లైన్ వారియర్స్ తో పాటు సిబ్బందికి కరోనా వాక్సినేషన్ చేయాలని సూచించారు. వాక్సినేషన్ విషయంలో ఎన్నికల సిబ్బందికి ప్రాధాన్యం ఇవ్వాలని రమేష్ కుమార్ సూచించారు. రమేష్ కుమార్ ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. 

పంచెలు తడుపుకుంటున్నారు...

ప్రజలు మా పాలనను మెచ్చుకుంటున్నారు. దేశంలోనే అత్యుత్తమ పాలన అందిస్తున్నామంటూ జబ్బలు చరుచుకుంటున్న వైసీపీ నేతలు.. స్థానిక సంస్థల పేరుతో ప్రజాభిప్రాయం తీసుకుందామంటే పంచెలు తడుపుకుంటున్నారని మాజీ మంత్రి, టిడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యానించారు. మార్చిలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని ఎన్నికలు వాయిదా వేస్తే.. ఎన్నికలు పెట్టాల్సిందే అంటూ గింజుకున్నారని అన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందంటూ కేకలేసిన బులుగు బ్యాచ్.. నేడు ఎన్నికలు పెడతామంటే వద్దంటూ అరవడం ఆశ్చర్యకరమని, స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్న ప్రతి సారి బులుగు బ్యాచ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని ఆయన అన్నారు. 

అండగా ఉన్నారని భావించిన ప్రజలు చెప్పులతో కొట్టి కనీసం ప్రచారానికి కూడా రానీయకుండా చేస్తారనే భయం వైసీపీ నేతల ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ దోపిడీ, దుర్మార్గాలు, అవినీతి, చేతకాని పరిపాలన, పనికిమాలిన పథకాలపై ప్రజల్లో స్పష్టత వచ్చింది. బులుగు బ్యాచ్ గుడ్డల్ని ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊడగొట్టడం ఖాయమని వారి మాటల్లోనే తెలుస్తోందని అన్నారు. ఇప్పటికైనా సిగ్గుతెచ్చుకుని.. ఎన్నికలకు సహకరించాలని బండారు సత్యనారాయణమూర్తి సూచించారు. 

 ఉద్యోగుల్ని, ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం చెప్పు చేతల్లో పెట్టుకుందని అన్నారు. స్కూళ్లు తెరిచారని, ప్రభుత్వ కార్యక్రమాలు, సభలు సమావేశాలు జరుగుతున్నపుడు లేని కరోనా.. ఎన్నికలకు మాత్రమే అడ్డంకి అన్నట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. 

దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడి ప్రజలో ప్రయాణాలు చేస్తున్నపుడు లేని కరోనా.. ఏ ఊరి ప్రజలు ఆ ఊరిలో ఓట్లు వస్తే కరోనా విస్తరిస్తుందా అని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలు.. ప్రజల కోసం పని చేయాలని అన్నారు. అంతేగానీ.. నీతి నియమాలు మాని వైసీపీ నేతల అడుగులకు మడుగులొత్తాలని ప్రయత్నిస్తే ఎదురు దెబ్బలు తప్పవని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు..