మున్సిపల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. రేపు పోలింగ్ నేపథ్యంలో నిమ్మగడ్డ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని ఎస్ఈసీ విజ్ఞప్తి చేశారు.

రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. పోలింగ్‌కు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్ఈసీ వెల్లడించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిమ్మగడ్డ హెచ్చరించారు. 

మరోవైపు బుధవారం జరగనున్న మున్సిపల్‌  ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవసరమైన అన్ని ఏర్పాట్లు  పూర్తి చేసింది. 4 పురపాలక సంఘాలు పులివెందుల (కడప), పుంగనూరు (చిత్తూరు), మాచర్ల, పిడుగురాళ్ల (గుంటూరు)లో అన్ని వార్డులనూ అధికార పార్టీ ‘ఏకగ్రీవాలు’ చేసుకుంది.

ఇక పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగర పాలక సంస్థలో ఎన్నికలపై సోమవారం హైకోర్టు స్టే ఇచ్చింది. ఏలూరు మినహా మరో 11 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు- నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవమైన 578 డివిజన్లు/వార్డుల్లో ఏకంగా 570 వైసీపీ ఖాతాకు చేరాయి. ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలకు అనుమతి లభిస్తే బుధవారం 2215 డివిజన్లు/వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి.