అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేస్తూ ఇచ్చిన మెమోను అధికారులు బేఖాతరు చేశారు. సాయంత్రం 5 గంటల లోపల తన వద్దకు రావాలని ఆదేశిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు గోపాలకృష్ణ ద్వివేదికి, గిరిజా శంకర్ లకు మెమో జారీ చేశారు.

అయితే, గోపాలకృష్ణ ద్వివేది గానీ గిరిజా శంకర్ గానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో సమావేశానికి రాలేదు. దీంతో దాదాపు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. వారిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా లేకపోవడం వల్లే ఆ ఇద్దరు ఉన్నతాధికారులు రమేష్ కుమార్ తో భేటీకి రాలేదని భావిస్తున్నారు. రేపు శనివారం ఉదయం పది గంటలకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధపడ్డారు. అధికార యంత్రాంగం సహాయ నిరాకరణ చేస్తున్న స్థితిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ ఎన్నికలను ఎలా నిర్వహిస్తారనేది కూడా ఆసక్తిగానే ఉంది.

ఇదిలావుంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో అడ్వొకేట్ జనరల్ సమావేశమయ్యారు. పంచాయతీ రాజ్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధపడిన స్థితిలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోం మంత్రి సుచరితతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా పాల్గొన్నారు.

నాటకీయంగా ఉద్యోగల సంఘాల నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తో సమావేశమయ్యారు. తాము ఎన్నికల్లో విధుల్లో పాల్గొనలేమని వారు తేల్చిచెప్పారు. దీన్నిబట్టి ప్రభుత్వ యంత్రాంగం యావత్తూ నిమ్మగడ్డను నిలువరించడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.  

ఇదిలావుంటే, ఆసక్తికరంగా గిరిజా శంకర్, గోపాలకృష్ణ ద్వివేది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తో సమావేశమయ్యారు.