గుంటూరు: తెలుగుదేశం పార్టీ యువనేత కోడెల శివరాంకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవలే ఆయన తండ్రి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడటంతో పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆయనకు ఏపీ రవాణా శాఖ షాక్ ఇచ్చింది. 

కోడెల శివరాంకు చెందిన గౌతమ్ ఆటోమోటివ్స్ షోరూం కు భారీ జరిమానా విధించింది. రూ.కోటి రూపాయలు జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది. రవాణా శాఖ అనుమతులు లేకుండా గౌతమ్ మోటార్ సంస్థ నుంచి 1000 మోటార్ బైక్ లు అమ్మినట్లు గుర్తించారు. 

ఈ నేపథ్యంలో రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ కోడెల శివరాం కు చెందిన గౌతమ్ ఆటోమోటివ్స్ షోరూం  సంస్థకు నోటీసులు ఇచ్చింది. రెండు రోజుల్లో జరిమానాను చెల్లించాల్సిందిగా తేల్చి చెప్పింది.

ఇకపోతే కోడెల శివరామకృష్ణకు చెందిన గౌతమ్ ఆటోమోటివ్స్ షోరూంపై ఇటీవలే ఏపీ రవాణా శాఖ దాడులు నిర్వహించింది. దాడులలో అనుమతులు లేకుండా బైకులు అమ్మినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో లైసెన్స్ ను రవాణశాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే.  

ఏపీ మోటార్ వాహనాల చట్టంలోని నిబంధన 84 ప్రకారం లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు  రవాణా శాఖ తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పాటు ఈ ఏడాది ఆగస్టు 2 వరకు జరిపిన వాహన విక్రయాల్లో అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. 

అయితే ఎలాంటి లైఫ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ పన్ను కట్టకుండానే 1025 వాహనాలను విక్రయించినట్లు కనుగొన్నారు. వెంటనే షోరూమ్ ని సీజ్ చేశారు. ఏపీ మోటారు వాహనాల చట్టం ప్రకారం షోరూమ్ బిజినెస్ అనుమతిని రద్దు చేశారు.

బైక్‌లకు టీఆర్‌ లేకుండానే విక్రయించినట్టు తెలుస్తోంది. దీని ద్వారా కోడెల శివరామ్‌ ప్రభుత్వ ఆదాయానికి రూ.కోటి వరకు గండి కొట్టారని రవాణశాఖ అధికారుల ప్రాథమిక విచారణలో తేటతెల్లమైంది. 

నిబంధనల ప్రకారం నూతన వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్‌ చార్జి కింద ప్రభుత్వానికి రూ.1000నుంచి 1300 వరకూ చెల్లించాలి. లైఫ్‌ ట్యాక్స్‌ కింద బైక్‌ ధరపై 9-14శాతం చెల్లించాలి. కానీ గౌతమ్‌ షోరూమ్‌ నుంచి ఎలాంటి చెల్లింపులు జరగలేదు. 

అంతేకాదు గౌతమ్ షోరూం నుంచి విక్రయించిన బైక్‌లన్నీ రూ.60 వేల నుంచి రూ.2 లక్షల మధ్య ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో బైక్ కి రూ.6వేల నుంచి రూ.20 వేల వరకు చెల్లించాల్సి ఉండగా కోడెల శివరామ్‌ ప్రభుత్వానికి చెల్లించకుండా నిబంధనలను తుంగలో తొక్కారని విచారణలో తేలింది. 

ఇకపోతే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని తన నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీలసులు విచారణ చేపట్టారు.