నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఏపీ పోలీసులు వీడియో కెమెరాల ద్వారా ప్రత్యేక విజువల్స్ తీయించుకుంటున్నారు. ఇప్పటికే ఆయన యాత్రలో పోలీసులు అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఒక వైపున వస్తున్నాయి. తాజా చర్యలతో ఈ ఆరోపణలు మరింత పెరిగాయి. 

అమరావతి: టీడీపీ యంగ్ లీడర్ నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కొత్తగా పోలీసుల వీడియో కెమెరాలు వచ్చి చేరాయి. యువగళం పాదయాత్రలో లోకేష్‌కు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. లోకేష్ మైక్ లాక్కోవడం, కుర్చీని లాక్కోవడం, అంతేకాదు, ప్రజలనూ పాదయాత్రకు రాకుండా అడ్డుకుంటున్నారని పార్టీ వర్గాలు ఇప్పటికే ఆరోపణలు మీద ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా, ఈ ఆటంకాల జాబితాలోకి పోలీసులు కొత్తగా వీడియో కెమెరాలను తెచ్చి ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నాయి.

ఈ యాత్రలో పోలీసులు దగ్గరుండి మరీ వీడియో కెమెరా ద్వారా విజువల్స్‌ను తీయించుకుంటున్నారు. ఇది వరకు కొన్ని చోట్ల డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెట్టిన సంగతి తెలిసిందే. కానీ, ఈ రోజు ఉదయం నుంచి రెండు వీడియో కెమెరాలను ప్రత్యేకంగా తెప్పించి కొన్ని విజువల్స్‌ను షూట్ చేయించుకుంటున్నారు. పోలీసులు వారి అసలు కర్తవ్యాలను పక్కనబెట్టి యాత్రలో వీడియో చిత్రీకరణ చేయడమేంటని పార్టీ వర్గాలు, అభిమానులు నిలదీస్తున్నారు.

Also Read: సీనియర్ నేత డీ శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత.. కార్యక్రమాలు రద్దు చేసుకున్న ఎంపీ అరవింద్

నారా లోకేష్ ఈ రోజు ఉదయం చంద్రగిరి మండలం శానంబట్ల, శివగిరిలో విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటి వరకు ఆయన పాదయాత్ర 380.5 కిలోమీటర్లు సాగింది. రాత్రి 7.45 గంటలకు మామందూరు విడిది కేంద్రానికి చేరనున్నారు. అక్కడ ఈ రోజు బస చేయ బోతున్నట్టు సమాచారం.