అమరావతి: అసెంబ్లీలో గోదావరి, కృష్ణ నదీ జలాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా నీరు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు ప్రకటించారు. గోదావరి నదిలో నీరు ఉండటంతో దాని ఫలితంగా ఏపీకి అత్యధికంగా నీరు వస్తుందని చెప్పుకొచ్చారు. 

అయితే గోదావరి, కృష్ణా నదుల నుంచి లభిస్తున్న ప్రతీ నీటి బొట్టును కాపాడుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందన్నారు. నదుల అనుసంధానం చేసి ఆ నీటిని కాపాడితే కరువు అనేది రాకుండా ఉంటుందని చంద్రబాబు సూచించారు. 

జాతీయ స్థాయిలో నదుల లింకేజీ కోసం గతంలో ప్రభుత్వాలు ప్రయత్నించాయని చెప్పుకొచ్చారు. మహానది, గోదావరి, బ్రహ్మపుత్ర వంటి నదులన్నింటిని కలిపి ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ప్రయత్నించిన విషయాన్ని చెప్పుకొచ్చారు. 

ప్రస్తుత కేంద్రమంత్రి సురేష్ ప్రభుత్వ ఆ టాస్క్ ఫోర్స్ కు చైర్మన్ గా వ్యవహరించారని తెలిపారు. అలాగే ఏపీలో గోదావరి-కృష్ణా నదుల అనుసంధానికి తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రయత్నించిందని అది సాధించిందని చంద్రబాబు తెలిపారు. 

రాష్ట్ర విభజన అనంతరం గోదావరి, కృష్ణా నీటిలో తెలంగాణ రాష్ట్రం వాటా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటాలపై ఖచ్చితమైన క్లారిటి రావాల్సి ఉందన్నారు. అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు దానిపై ఎలాంటి క్లారిటీ లేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలా అయితే పంచుకున్నామో అలాగే పంచుకుంటున్నట్లు తెలిపారు. 

గోదావరి కృష్ణా నదీజలాలను దామాషా ప్రకారం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు పంచాలని కోరినట్లు తెలిపారు. అయితే అందుకు కృష్ణాట్రిబ్యునల్ అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. వంశధార ప్రాజెక్టు విషయంలో కూడా ఒడిశా అడ్డంకులు సృష్టిస్తోందని చంద్రబాబు తెలిపారు. 

గతంలో తమిళనాడు ప్రభుత్వం కూడా ఇబ్బందులు సృష్టించిందని చెప్పుకొచ్చారు. పాలారు పైన చెక్ డ్యాం కట్టుకునేందుకు తమిళనాడు మాజీ సీఎంలు కరుణానిధి, జయలలితలు ఎన్నో అడ్డంకులు సృష్టించారని చంద్రబాబు గుర్తుకు తెచ్చారు. 

గోదావరి నీళ్లు పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్నాయని సముద్రంలోకి కొంత నీరు వృధాగా పోతుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గోదావరి నీరు పోలవరంలోకి వచ్చి వృధాగా సముద్రంలోకి పోతుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నదీ జలాలను సంవృద్ధిగా వినియోగించుకోవాలన్నదే తమ తాపత్రాయమన్నారు. నదుల అనుసంధానంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగితే బాగుంటుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.